Malnadu Drugs Case: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నారు. ఇప్పటికే మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేతి, ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాజాగా సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్‌ను కూడా ఈగల్ అధికారులు అరెస్ట్ చేశారు. సూర్య, రాహుల్ తేజ, మోహన్, హర్ష కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు.
కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు ఈగల్ టీం అధికారులకు సమాచారం అందింది. దీంతో యజామని సూర్య అమ్మినేనితో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ ఉండటం షాక్‌కు గురిచేసింది. దీనిపై మరింత లోతుగా విచారించగా గతేడాది కూడా రాహుల్ తేజపై డ్రగ్స్ కేసులో నిజామాబాద్ పోలీసులు ఏ3 నిందితుడిగా కేసు నమోదుచేశారు.అయితే ఇంతవరకు అతడిని అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. రాహుల్ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయించేవాడని పోలీసుల విచారణలో తేలింది.
ఈ క్రమంలోనే డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారని ఆరా తీయగా..సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అతడిని కూడా అదుపులోకి తీసుకుని నిందితులందరినీ రిమాండ్‌కు తరలించారు. ఏకంగా ఇద్దరు పోలీస్ అధికారుల కుమారులు డ్రగ్స్ కేసులో దొరకడం పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు ఇంకెతంమంది ఈ గలీజ్ దందాలో ఉన్నారో ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read: డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ పోలీస్ అధికారి కొడుకు..!
కాగా తెలంగాణలో డ్రగ్స్ రహిత సమాజమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈగల్ టీమ్ డ్రగ్స్ విక్రయాలు, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లలో డ్రగ్స్ వినియోగంపై అధికారులు నిఘా పెట్టారు.


