Hyderabad: జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లలో నివసించే వారికి కూడా తెలియని అద్భుతాలు ఎన్నో నగరంలోనే ఉన్నాయి. ఇప్పటికే అద్భుతమైన పర్యాటక నగరంగా పేరున్న మన భాగ్యనగరానికి ఒకవైపు ఆధునిక హంగులు అద్దుతూనే మరోవైపు పురాతన ప్రాంతాలకు కూడా తిరిగి మహర్దశ తీసుకొస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంలో GHMC, HMDA కలిసి పురాతన మెట్ల బావులను పునరుద్దరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 44 దిగుడు బావుల పునరుద్ధరణకు సిద్దమైన అధికారాలు.. అందులో బాపూఘాట్, గచ్చిబౌలి, గుడిమల్కాపూర్, శివబాగ్, బన్సీలాల్‌పేట, సీతారాంబాగ్ సహా మొత్తం ఆరుచోట్ల మెట్ల బావులను యుద్ధప్రతికాదికన పనులు చేపట్టారు. ఇవన్నీ దేనికి దానికే ప్రత్యేకత కలిగిన బావులు కాగా.. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ మెట్ల బావి చూసి తీరాల్సిందిగా చెప్పుకోవచ్చు. మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బావి మొత్తం మూడు అంతస్తులలో నిర్మించారు.
ఈ బావిలో మెట్లు, అందమైన శిల్పాలు, ఆకట్టుకునే రాతి నిర్మాణాలు దేనికవే ప్రత్యేకతతో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్న ఈ బావి ఆధునీకరణ పనులు సాధ్యమైనంత త్వరగా ముగించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అధికారులు, మంత్రి తలసాని శ్రీనివాస్ వెల్లడించారు. ఒకవైపు పనులు జరుగుతుండగానే ఈ బావిని సందర్శించిన కొందరు చూసి తీరాల్సిన ప్రదేశమని కొనియాడుతున్నారు.