విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతిపైన ఆయన సమీక్ష జరిపారు. స్మృతివనంలో సివిల్ వర్క్స్, సుందరీకరణ పనులను సీఎంకు వివరించిన అధికారులు.. పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయని, ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని తెలిపారు. అంబేద్కర్ భారీ విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.. ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు.
విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామన్న అధికారులకు, అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టని పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా ఈ నిర్మాణాలు ఉండాలన్నారు ముఖ్యమంత్రి.