Saturday, July 12, 2025
HomeతెలంగాణAttack On Media Office: మీడియా ఆఫీసుపై దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

Attack On Media Office: మీడియా ఆఫీసుపై దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు


Leaders Condemns Attack On Media Office:
హైదరాబాద్ లోని ఓ న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు మీడియా కార్యాలయంపై బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఆస్కారం లేదని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదన్నారు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.

- Advertisement -

ఇక హైదరాబాద్ లోని ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా ఖండించారు. మీడియాలో వచ్చిన వార్తలు, కథనాలపై ఏమైనేా అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుందన్నారు. అంతేకానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ఈ దాడికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

మరోవైపు ఈ దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్ర‌జాస్వామ్యంలో భౌతిక దాడుల‌కు ఎన్న‌టికీ ఆస్కారం ఉండ‌కూద‌ని తెలిపారు. అబ‌ద్ధాల‌కు, అసంద‌ర్భ ప్రేలాప‌న‌ల‌కు మీడియా ముసుగులో చేసే నీచ‌పు రాజ‌కీయాల‌కు కూడా అస్స‌లు తావు ఉండ‌కూడ‌ద‌ని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్ర‌శాంతంగా ఉండాల‌న్నారు. కార్య‌క‌ర్త‌ల బాధ, గౌర‌వం అర్థం చేసుకోగ‌ల‌న‌ని పేర్కొన్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు రేవంత్ రెడ్డి లాంటి వ్య‌క్తి రాష్ట్రాన్ని పాలించిన‌ప్పుడు అబద్ధాలు, నింద‌లు త‌ప్ప‌వ‌న్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై పోరాటం చేయాలని కార్య‌క‌ర్త‌ల‌కు కేటీఆర్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News