మీడియాకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా ప్రతినిధులు ఆయనకు కొన్ని ప్రశ్నలు వేశారు. దీంతో నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని.. అందుకే ఈ ఘటనకు మద్దుతు ఇస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు జర్నలిస్టులు ఈ ఆరోపణలను తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీవీ ఆనంద్ పోస్ట్ పెట్టారు.
‘‘ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రెస్‌మీట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో కాస్త సహనాన్ని కోల్పోయాను. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసింది పొరబాటుగా భావిస్తున్నాను. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమాపణలు కోరుతున్నా’’ అని తెలిపారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని పేర్కొన్నారు.