Monday, July 8, 2024
HomeతెలంగాణArikepudi Gandhi: నామినేషన్ దాఖలు చేసిన అరికెపూడి గాంధీ

Arikepudi Gandhi: నామినేషన్ దాఖలు చేసిన అరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు

భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున శేరీలింగంపల్లి అభ్యర్థిత్వానికి మాజీ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిలతో కలిసి గాంధీ తన నామినేషన్ పత్రాన్ని శేరిలింగంపల్లి ఎన్నికల అధికారి బి. శ్రీనివాస్ రెడ్డికి సమర్పించారు.

- Advertisement -

నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వివేకానంద నగర్ లోని తన ఇంటి నుండి ఉదయం ఏడు గంటలకు గాంధీ ఊరేగింపును ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి భారీ ఎత్తున ఊరేగింపు కొనసాగింది. వివేకానంద నగర్ నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ కే.పి.హెచ్.బి. కాలనీ, హైదర్ నగర్, మియాపూర్ మీదుగాసాగి, తారానగర్ లోని తుల్జా భవాని ఆలయానికి చేరుకుంది. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో అరికెపూడి గాంధీ, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవి అనుగ్రహాన్ని పొందారు.

అనంతరం ప్రారంభమైన ఊరేగింపు నెహ్రు నగర్, ఆదర్శ్ నగర్ మీదుగా సాగింది. గుల్మోహర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ కార్యకర్తలు,క్రేన్ సహకారంతో భారీ గజమాలను గాంధీని తొడిగించారు. ఆ తర్వాత ఊరేగింపు ప్రారంభమై శేరిలింగంపల్లి కార్యాలయానికి చేరుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాగం నాగేందర్ యాదవ్, షేక్ హామీద్ పటేల్, మంజుల రెడ్డిలతో కలిసి గాంధీ తమ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి అందించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద గాంధీ ముగ్గురు కార్పొరేటర్ల తో కలిసి మాట్లాడారు. కెసిఆర్ తొమ్మిదేళ్ల పాలనలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలను ప్రవేశపెట్టారని చెప్పారు. నీరు, విద్యుత్తు, పారిశుద్ధం, గ్రీన్ పార్కులు వంటి ఎన్నో అభివృద్ధి పథకాలను చేపట్టామన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 40 పార్కులను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచామని తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ దేశ విదేశాలు పర్యటించి రాష్ట్రంలో ఐటీ సంస్థలను ప్రోత్సహించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ప్రశంసించారు. రానున్న కాలంలో మరో లక్ష డబల్ బెడ్ రూమ్ లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేద, బడుగు, బలహీన వర్గాలకు అదనంగా ఒక స్లాబ్ నిర్మాణం కొరకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని గాంధీ ప్రకటించారు. రైతులకు, దళితులకు, మైనారిటీల సంక్షేమం కొరకు కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గాంధీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, చందానగర్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News