శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద ఉరిటి వెంకట్రావు యువసేన ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, స్ధానిక శాసన సభ్యులు అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. పర్యావరణానికి హనికరం కాకుండా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని, అనంతరం మట్టి విగ్రహాలను ఇంటి పెరటిలోనే. నీళ్లలో నిమజ్జనం చేసి, ఆ స్ధానంలో పచ్చని మొక్కలు నాటాలని ఆయన సూచించారు. మట్టి గణపతి విగ్రహాలే మహా గణపతులని, కృత్రిమ విగ్రహాలను వాడటం మానవాళికి శ్రేయస్కరం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉరిటి యువసేన అధినేత ఉరిటి వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రతిఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలనే ఉద్దేశంతో తమవంతు సేవా కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పోరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, స్ధానిక ప్రజాప్రతినిధులు రఘుపతి రెడ్డి, రవీంద్ర రావు, వీరేశం గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, రాజు యాదవ్ ధనలక్ష్మి, భవాని చౌదరి తదితరులు పాల్గొన్నారు.