Friday, November 22, 2024
HomeతెలంగాణArmur: దివ్యాంగులకు స్వర్ణ యుగం

Armur: దివ్యాంగులకు స్వర్ణ యుగం

బ్రహ్మ రాసిన నుదిటిరాతనే తిరగరాసిన అభినవ బ్రహ్మ కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణ యుగమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణా దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116/ రూపాయలకు పెంచిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులందరితో ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళన’ కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మ రాసిన నుదిటిరాతనే తిరగరాసిన అభినవ బ్రహ్మ కేసీఆర్ అన్నారు.

- Advertisement -


“అంగవైకల్యం ఒక లోపం మాత్రమే. ముందుకు పోకుండా అడ్డుకునే శాపం కాదు. లక్ష్యాన్ని సాధించడంలో వైకల్యం అడ్డురాదని నిరూపించినవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, లూయిస్‌ బ్రెయిలీ, హెలెన్‌ కెల్లర్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ నుంచి నేటి నిక్‌ ఉయిచిచ్‌, ఇరా సింఘాల్‌, సుధాచంద్రన్‌, తంగవేలు, ప్రాంజల్‌ పాటిల్‌ తదితరులు అంగవైకల్యాన్ని జయించి ఆయా రంగాల్లో అద్భుతాలు సృష్టించారు.


ఐఏఎస్ సాధించిన విద్యావంతురాలైన ప్రాం జల్ పాటిల్ కు అంధత్వం. ఒంటి కాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
దివ్యాంగుల పెన్షన్ రూ. 4016కు పెంచిన కేసీఆర్ ది చల్లని మనసన్నారు. దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని వారికి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,40,000 మంది దివ్యంగులకు నెలకు 3,016/- ద్వారా నెలకు రూ .180 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1800 కోట్లు ఇస్తున్నారన్నారు.


ఒక్క పెన్షనే కాకుండా వికలాంగుల సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్స్‌లో 5 శాతం రిజర్వేషన్లు, విద్య-ఉపాధి పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. బ్యాట‌రీ ట్రై సైకిళ్ళు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవ‌య‌వాలు మొత్తం 14 ర‌కా‌ల‌ వస్తువులను దివ్యాంగులకు అందిస్తున్నారని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా చదువుకునే దివ్యాంగ విద్యార్థుల కోసం 300 ల్యాప్‌టాప్స్, 400 స్మార్ట్‌ఫోన్స్, 1000ద్విచక్ర వాహనాలు, 650 బ్యాటరీ వీల్ ఛైర్స్ అందించారన్నారు. కాగా దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తం పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం లో కూడా దివ్యంగులకు ఇచ్చేది కేవలం రూ. 1000/- మాత్రమే.బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్రలో రూ.300, మధ్యప్రదేశ్ లో రూ.300, ఉత్తరాఖండ్ లో రూ.1000, ఉత్తరప్రదేశ్ లో రూ.1000, మణిపూర్ లో రూ.1500, త్రిపురలో రూ. 700, మమతా బెనర్జీ ఏలుతున్న పశ్చిమ బెంగాల్ లో రూ.700 లు మాత్రమే ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రూ.4,116లు ఇస్తున్నారు. పెన్షన్ల పెంపు మాత్రమే కాదు అన్ని సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు పెద్ద పీట వేస్తాం.


సీఎం కేసీఆర్ గారి పాలనలో సంక్షేమ రంగం ఒక స్వర్ణయుగం
నాటి సంక్షోభానికి పాతరేసి నేడు సంక్షేమ జాతర సాగుతోంది. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, నల్లాల ద్వారా మంచినీటి సరఫరా, ఆర్మూర్ నియోజకవర్గంలో 5వేల మంది వికలాంగులకు రూ.4016, 52,670 మందికి రూ.2016 చొప్పున పెన్షన్లు, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్లు వంటి 450 పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టే సంబురాలు జరుపుకుంటున్నాం. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విమర్శిస్తే ఊరుకోం. కాంగ్రెస్, బీజేపీ నేతలు దద్దమ్మలు. చదువురాని సన్నాసులు. కళ్లుండి చూడలేని కబోదులు. దివ్యాంగులను ఏనాడూ పట్టించుకోలేదు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసలు వికలాంగులు మీరు కాదు. అన్నీ ఉండి ఇతరుల కోసం ఏమీ చేయడానికి ముందుకు రానివారు మానసిక వికలాంగులు. కాళ్ళూ చేతులూ ఉండి ఇతరుల కోసం ఏ సేవా చేయనివారు ఫిజికల్లీ హేండీకాప్డ్. కళ్ళుండి కూడా ఇతరుల మంచి చూడలేని వారు, తోటివారికి అవసరమైన సహాయం చేయనివారు నిజమైన బ్లయిండ్ పీపుల్. ఎదుటి వారి ఉన్నతస్థితికి బాధపడి ఏడ్చేవారు మెంటల్లీ రిటార్డెడ్.


అన్నీ అవయవాలూ సరిగా ఉండి శ్రమ చేయగల శక్తిసామర్థ్యాలుండి ఏ పని చేయని సోమరి పోతులే అసలైన వికలాంగులు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఓర్వలేక విషం కక్కుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులే రాజకీయ వికలాంగులు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ దేశ ప్రధాని అయితేనే ఈ 450 పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలవుతాయన్నారు. తాను 60వేలకు పైగా ఓట్ల మెజారిటీ తో మళ్లీ గెలవడం ఖాయమన్న ధీమాను జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.

దివ్యాంగులకు విందు భోజనం-స్వయంగా వడ్డించిన జీవన్ రెడ్డి

ఇదిలా ఉండగా ఆత్మీయ సమ్మేళనం అనంతరం వేలాదిమంది దివ్యాంగులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆయన స్వయంగా భోజనాలు వడ్డించారు. అంతకుముందు దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పండిత్ వినితాపవన్, వైస్ ఛైర్మన్ మున్నభాయ్, నందిపేట్ జడ్పిటిసి యమునా ముత్యం, ఆర్మూర్ జడ్పిటిసి సంతోష్, మాక్లూర్ ఎంపిపి మాస్త ప్రభాకర్, నందిపేట్ ఎంపిపి వాకిడి సంతోష్ రెడ్డి, ఆర్మూర్ ఎంపిపి పస్క నర్సయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు,ఎంపిటీసిలు, పీఏసీఎస్ ఛైర్మన్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News