Wednesday, September 18, 2024
HomeతెలంగాణAsifabad: పోడుభూముల పంపిణీ చేసిన సీఎం కేసీఆర్

Asifabad: పోడుభూముల పంపిణీ చేసిన సీఎం కేసీఆర్

పోడు పట్టాలన్నీ మహిళల పేరు మీదనే

బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన యోధుడు కుమురం భీం విగ్రహావిష్కరణ, జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవాలతో పాటు, మాజీ మంత్రి కొట్నక్ భీం రావ్ విగ్రహ ఆవిష్కరణ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి, గిరిజన యోధుడు, కుమురం భీమ్, మాజీ మంత్రి కొట్నక్ భీమ్ రావ్ విగ్రహాలను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్.

- Advertisement -

సిద్దిపేటలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి హెలికాప్టర్ లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి కుమురం భీం చౌరస్తాకు చేరుకున్న సీఎం అక్కడ కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయానికి చేరుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయానికి చేరుకున్న సీఎంకి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ తల్లికి పుష్పాంజలి సమర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రిబ్బన్ కట్ చేసి బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం నుంచి చిల్డ్రెన్ పార్క్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ మాజీ మంత్రి కొట్నక్ భీమ్ రావ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఘనంగా నివాళులు అర్పించారు.

కుమురం భీమ్ జిల్లా నూతన పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీఎం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కి హోంమంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజనీ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎంకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ మధ్య సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి జిల్లా నూతన పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ సురేష్ కుమార్ సీఎంని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అంజేశారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గారికి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్ఖడే పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీఎం గారు నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్ శాంతి కుమారి, కలెక్టర్ హేమంత్ బోర్ఘడే తో కలిసి సీఎం నూతన కలెక్టరేట్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. వారితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ హేమంత్ బోర్ఖడే ను ఆయన ఛాంబర్ లోని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత ప్రార్థనల అనంతరం కలెక్టర్ హేమంత్ సీఎం కేసీఆర్ ని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారుల కుటుంబాలలోని గిరిజన మహిళల పేరుతో, 12 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ స్వయంగా పట్టాలు అందించారు.

ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ పంచాయతీకి చెందిన కర్పెత విమలాబాయి దంపతులు, కెరమెరి మండలం జోడెఘాట్ గ్రామ పంచాయతీకి చెందిన కాటి అన్యాబాయి దంపతులు, సిర్పూర్ (అర్బన్) మండలం పంగిడి గ్రామ పంచాయతీకి చెందిన కుమ్ర మంకూబాయి దంపతులు, తిర్యానీ మండలం ఏదులపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఏదుల ఎల్లక్క దంపతులు, వాంకిడి మండలం పాటగూడ గ్రామ పంచాయతీకి చెందిన కత్లే భగీరథ దంపతులు, జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన వనిత మగదె దంపతులు, కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన మాధవీలక్ష్మి దంపతులు, మాధవీకల్లుబాయి దంపతులు, కాగజ్ నగర్ మండలం మాలినీ గ్రామ పంచాయతీకి చెందిన సూర్పం సునీత దంపతులు, సూర్పం అనసూయ దంపతులు, కాగజ్ నగర్ ఎన్జీవోస్ కాలనీ టేకం జానూబాయి దంపతులు, ఆత్రం రాంబాయి దంపతులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలు అందజేశారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జోగు రామన్న, రాథోడ్ బాపూరావు, రేఖానాయక్, విఠల్ రెడ్డి, మాజీ ఎంపి నగేష్, జడ్పీ ఛైర్ పర్సన్ లక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస రాజు, నారదాసు, స్థానిక బిఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News