CM Revanth Reddy ATC Inauguration: మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి, యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను (ATC) ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ‘మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలనే ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. కోర్సులను అప్‌గ్రేడ్ చేయకపోవడంతో కాలక్రమేనా ఐటీఐలు నిర్వీర్యమయ్యాయి. మేము అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలనే ఆలోచన చేశాం. నేడు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేశాం. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు.’ అని సీఎం వ్యాఖ్యానించారు.
నైపుణ్యం లేని సర్టిఫికెట్లు వేస్ట్
తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ రోజు ప్రారంభించిన 65 ఏటీసీలే నిదర్శనమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65 ఏటీసీలను పూర్తి చేశామని.. వచ్చే ఏడాది నాటికి మరో 51 ఏటీసీలను నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి యువతకు నైపుణ్యాన్ని అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

టెక్నాలజీని అలవరుచుకోవాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యంపై యువత దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ‘జర్మనీ, జపాన్ దేశాలు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదువు ఒక్కటే యువత తలరాతను మారుస్తుందని.. అది యువత చేతుల్లోనే ఉందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఉద్ఘాటించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/brd-mla-harish-rao-fire-on-congress-over-hyderabad-floods/
డ్రగ్స్‌కు బానిస కాకండి
‘డ్రగ్స్, గంజాయి ఈ సమాజానికి పట్టిన చీడ.. వ్యసనాలకు బానిస కాకండి. తల్లిదండ్రులకు బాధను మిగల్చకండి. ఏటీసీల్లో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటీస్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కి సూచిస్తున్నాను. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు ప్రతీ నెలా రూ. 2 వేలు స్కాలర్‌షిప్ అందించేలా ఆర్థిక మంత్రిని ఒప్పిస్తాం. ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని సీఎం వివరించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/tg-local-elections-high-level-review-sec-cs-dgp-meeting/
యువత భవిష్యత్ కోసం మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగ అవకాశాలను ఇచ్చేందుకు జపాన్ సిద్ధంగా ఉందని.. మనిషికి తెలివి, పని చేసే కమిట్‌మెంట్ ఉంటే.. ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని సూచించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని.. మీ భవిష్యత్‌కు పునాదులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


