Bhadrachalam EO: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అసలు ఏం జరిగిందంటే.. భద్రాచలం దేవస్థానానికి చెందిన భూములను ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నం గ్రామస్తులు కబ్జా చేశారు. దీంతో కొంతకాలంగా ఈ భూముల విషయంలో గ్రామస్తులకు, దేవాదాయశాఖ అధికారులకు మధ్య వివాదం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో అధికారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. భద్రాచలం ఆలయానికి పురుషోత్తపట్నంలో 889.50 ఎకరాల భూమి ఉందని.. అయితే ఆ భూములు కబ్జాకి గురవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. కబ్జాకు గురైన భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ భూములను ఆలయానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా కానీ హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసిన కబ్జాదారులు ఇటీవల ఆ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న ఆలయ ఈవో రమాదేవి తన సిబ్బందితో నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కబ్జాదారులు ఆమెను అడ్డుకుని తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఈవోపై దాడికి దిగడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, ఆలయ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికత్స అందించడంతో ఆమె తేరుకున్నారు. ఏకంగా ముగ్గురు తెలంగాణ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: కేటీఆర్ చిల్లర రాజకీయాలు మానుకో.. మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం
కాగా ఉమ్మడి ఏపీ విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపారు. ఈమేరకు 2014లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడే అసలు సమస్య మొదలైంది. అంతకుమందు ఈ ఏడు మండలాలు భద్రాచలం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. దీంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమను తిరిగి తెలంగాణలో కలపాలని ఏడు మండలాల ప్రజలు వేడుకుంటున్నారు.


