Teenmar Mallanna Office: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న మల్లన్న ఆఫీసులోకి చొరబడ్డారు. అనంతరం కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీజర్ ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సిబ్బందిపైనా దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
అయితే పరిస్థితి చేజారిపోవడంతో అక్కడే ఉన్న మల్లన్న గన్‌మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. కాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


