Sunday, November 16, 2025
HomeతెలంగాణAzharuddin Portfolio: శాఖ కేటాయింపుపై వీడని ఉత్కంఠ.. హోంశాఖే కావాలని అజార్ భాయ్ పట్టు!

Azharuddin Portfolio: శాఖ కేటాయింపుపై వీడని ఉత్కంఠ.. హోంశాఖే కావాలని అజార్ భాయ్ పట్టు!

Azharuddin Portfolio issue: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు శాఖ కేటాయింపు వ్యవహారం రెండు రోజులుగా అటకెక్కింది. సాధారణంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపు జరగడం సర్వసాధారణం. అయితే అజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

హోంశాఖ కావాలంటూ అజారుద్దీన్ పట్టు: శాఖల కేటాయింపు ఆలస్యానికి ముఖ్య కారణం.. హోంశాఖ కావాలని అజారుద్దీన్ పట్టుబట్టడమే అని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి హోంశాఖ కేటాయించడంతో ఇప్పుడు కూడా తనకు ఆ శాఖ ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ ముఖ్యుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
క్రీడలు, మైనార్టీ శాఖకే సర్కారు మొగ్గు: కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టుగా తెలుస్తోంది. అజారుద్దీన్‌కు క్రీడలు, మైనార్టీ సంక్షేమం, అవసరమైతే అదనంగా మరో శాఖ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ శాఖల కేటాయింపునకు అజారుద్దీన్ సుముఖత చూపకపోవడంతోనే ప్రతిష్టంభన ఏర్పడిందని తెలుస్తోంది. పార్టీలో సామాజిక సమీకరణాలు, ఇతరత్రా కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో కీలకమైన హోంశాఖ కేటాయించడం సాధ్యం కాదనే చర్చ పార్టీలో జరుగుతున్నట్టు సమాచారం. దీని కారణంగా శాఖల కేటాయింపు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద హోంశాఖతో పాటు మున్సిపల్, విద్యాశాఖ, వాణిజ్య పన్నులు వంటి కీలక శాఖలు ఉన్నాయి. అజారుద్దీన్‌కు కేటాయించాలని భావిస్తున్న క్రీడాశాఖ వాకిటి శ్రీహరి వద్ద, మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్నాయి. వారి నుంచి ఆ శాఖలను తొలగించి అజారుద్దీన్‌కు అప్పగించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా శాఖలు కోల్పోయిన మంత్రులకు ఇతర శాఖలు కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ మైనార్టీ వర్గాల ఆసక్తి: ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకున్న తరుణంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఆ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆలస్యం జరిగితే ప్రతిపక్షాలు దీనిని విమర్శనాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా శాఖ కేటాయించి.. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత ఇచ్చిందనే సానుకూల సంకేతాన్ని ఆ వర్గాల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad