తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ డివిజన్ వినాయక నగర్, బాలాజీ నగర్, శివాజీ నగర్, బృందావన్ కాలనీ, ప్యారా మౌంట్ కాలనీ, విరాట్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కార్డును ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారాలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు, 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు పాల్గొన్నారు.