Sunday, October 6, 2024
HomeతెలంగాణBabu Mohan Exclusive to Teluguprabha: TDP, BJP రెండు పార్టీలు ఒక్కటే, రాబోయే ఎన్నికల్లో...

Babu Mohan Exclusive to Teluguprabha: TDP, BJP రెండు పార్టీలు ఒక్కటే, రాబోయే ఎన్నికల్లో గెలిచేది మేమే

తెలుగుప్రభ తో బాబు మోహన్ మనసులో మాట తెలుగుప్రభ రీడర్స్ కోసం ప్రత్యేకంగా ఇస్తున్నాం. కళామతల్లి ఒడిలో నేను నిత్య విద్యార్థినంటూ బాబు మోహన్ వివరించారు.  అప్పుడు టిడిపిలో ఉన్న వారంతా ఇప్పుడు బిఆర్ఎస్ లో కనిపిస్తున్నారన్నబాబు మోహన్, టిడిపి బిజెపి రెండు పార్టీలు ఒక్కటేనని తేల్చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది మేమే అంటున్న బాబూమోహన్ తో మాటా మంతీ మీరు చదవండి..

- Advertisement -
  1. బాబూ మోహన్ గారు.. గతంలో మీరు లేకుండా సినిమాలు వచ్చేవి కావు, ఇప్పుడు మీ ఫ్యాన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మరి మీ ఫ్యాన్స్ కోసమైనా సెకెండ్ ఇన్నింగ్స్ ఎందుకు మొదలుపెట్టడం లేదు ?
    బాబు మోహన్: నేను గతంలో చాలా సినిమాలు చేశాను తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజలకు దగ్గరగా ఉంటూ సినిమాలకు సమయం ఇవ్వలేక దూరమయానే తప్ప కళామతల్లిని నేను ఎప్పుడు మర్చిపోను నాకు జీవితం ఇచ్చిందే కళామతల్లి అలాంటి సినీ పరిశ్రమకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కార్మిక శాఖ మాత్యులుగా పనిచేస్తున్నప్పుడే సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నాను. మంత్రిని అయ్యాక సినిమాలలో నటించకూడదు అన్నారు. అంతే తప్ప చిత్ర పరిశ్రమకు, సినిమాలకు నా ప్రేక్షక దేవుళ్లకు ఎప్పుడు దూరం లేను.
  2. ఓటీటీ ప్లాట్ ఫాం వచ్చాక చాలా మంది యాక్టర్స్ సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యారు, మిమ్మల్ని కనీసం వెబ్ సిరీస్ ల్లోనైనా చూసే ఛాన్స్ లేదు, ఏంటి మీకు ఓటీటీపైన ఇంట్రెస్ట్ లేదా? మిమ్మల్ని బిగ్ స్క్రీన్ లేదా స్మాల్ స్క్రీన్ పై మళ్లీ ఎప్పుడు చూడగలమో మా రీడర్స్ కు చెప్పండి ప్లీజ్.

బాబు మోహన్: నేను ఇప్పటివరకు 400 ఎపిసోడ్ల వరకు టీవీ షోలలో నటించాను. అలాగే ఆ ఒక్కటి అడక్కు అనే సీరియల్ లో కూడా ప్రేక్షక దేవుళ్లకు దగ్గరగా ఉండాలని ఆలోచనతోనే నటించాను. అలాగే ఇప్పుడు ఏడు సినిమాలలో నటిస్తున్నాను. ఈ రాబోయే రోజుల్లో ఓటిటి లో, వెబ్ సిరీస్ లో కావచ్చు ఎందులోనైనా సరే ఏడు సినిమాలు ప్రేక్షక దేవుళ్ళ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు నేను 1400 సినిమాలలో నటించాను. కావున ఎప్పుడు కూడా నటనకు కానీ ప్రేక్షక దేవుళ్లకు కానీ దూరంగా ఉండను. దేవుడు ఎలా శాసిస్తే నేను అలా చేస్తూ పోతూ ఉంటాను.

  1. అసలు ఇండస్ట్రీకి మీరు దూరమయ్యే అవసరమేంటి, మీలాంటి సీజన్డ్ యాక్టర్స్ కొరత టాలీవుడ్ లో చాలా ఎక్కువగా ఉంది.

బాబు మోహన్: మీరు అంటున్న మాట వాస్తవమే. ఇప్పుడున్న కమెడియన్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు ఎవరైనా సరే ఒక సినిమా తీశారో లేదో మేమే గొప్ప అనేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి అహంభావం నాకు లేదు. ఎవరైనా ప్రొడ్యూసర్ గానీ, డైరెక్టర్ కానీ నా దగ్గరకు వచ్చి మీరు ఈ సినిమా చేయండి అని అంటే చేస్తున్నాను తప్ప నా అంతలా నేను పోయి నాకు అవకాశం ఇవ్వండి అని నేను అప్పుడు అడగలేదు ఇప్పుడు కూడా అడగను. ఎవరైనా వచ్చి అడుగుతే మాత్రం కాదు అనను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల కు దగ్గర ఉండే పాత్రలు మాత్రమే పోషిస్తాను. అంతేకానీ ఏది పడితే అది పోషించే స్థాయిలో నేను లేను.

  1. అప్ కమింగ్ యాక్టర్స్ కు మీరు చెప్పేదేంటి, అసలు టాలీవుడ్ ఇప్పుడు ఎలా ఉంది, టాలీవుడ్ రాజకీయాలపై మీ కామెంట్స్

బాబు మోహన్: ఒక జబర్దస్త్ షోలోనే చేసేటటువంటి వ్యక్తుల జోలికి పోతానే అహంభావం మనకు కనిపిస్తుంది. ఒక షో సక్సెస్ అయితుందో కాదు అతను పెద్ద సెలబ్రిటీ నన్ను మించినోడు లేడు అనే వ్యక్తిత్వం అది కాదు ముఖ్యం.నేను, నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు కళామతల్లి ఒడిలో ఇంకా విద్యార్థులమే మాలోపల ఏ హాంభావం లేదు మేము ఇంకా నిత్య విద్యార్థులమే ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కావున కళామతల్లి ఒడిలోకి ఎవరు వచ్చిన ఆదుకుంటుంది. ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి ఎలా చూడాలి? ఏంది అన్నది ప్రేక్షక దేవుళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకానీ నా చేతిలో ఏమీ లేదు ..నీ చేతిలో ఏమీ లేదు..

  1. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే .. మీరు బీజేపీ నేతలతో మీకున్న పేచీ ఏంటి, టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీరు చాలా చురుగ్గా ఉండేవారు కానీ బీజేపీలో చేరాక ఎందుకు ఇంత డల్ గా అంటీ ముట్టనట్టుంటున్నారు?

బాబు మోహన్: బిజెపి నాయకులతో నాకు ఎలాంటి పేచిలేదు. కాకపోతే తెరాస పార్టీలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రంకు అందులో ఒక నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తిని నేను అలాంటి నన్ను అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, నా పని తనం చూసి నా వ్యక్తిత్వ స్వభావాన్ని చూసి 12 రాష్ట్రాలలో ప్రచారం చేయించారు. ఒక సముద్రం లాంటి పార్టీలో నేను పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాంటి నేను ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలలో కొన్ని సందర్భాలలో కనబడకపోవచ్చు. అంతేకానీ పార్టీకి ఆంటీ ముట్టనట్టు ఉండడం అన్నది అసంభవం.

  1. టీడీపీలో యమ హుషారుగా ఉండేవారు, టీడీపీ వదిలిపెట్టి టీఆర్ఎస్ లోకి వెళ్లారు కానీ టీఆర్ఎస్ ఎందుకు వదిలి వెళ్లారు? మీరు పార్టీలు మారే పొలిటీషియన్ అనే ముద్ర వేయించుకున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది.

బాబు మోహన్: అవును వాస్తవమే.. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో అన్నగారి అడుగుజాడల్లో నడిచిన మాట వాస్తవమే అప్పుడు ఆందోలు నియోజకవర్గంలో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు టిడిపి, బిజెపి రెండు కండువాలు వేసుకొని ప్రచారం చేశాను. అప్పుడు రాష్ట్రంలో టిడిపి ఉంది కేంద్రంలో బిజెపి ఉంది కావున రెండు పార్టీలు నాకు సమానమే. అలాగే ఇప్పుడున్న రాజకీయంలో టిఆర్ఎస్ ఎక్కడ ఉంది? ఉన్నదంతా టిడిపి నే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒకసారి మీరు చూడండి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు టిడిపి నుంచి వచ్చిన వాళ్ళు కాదు టిఆర్ఎస్ టిడిపి ఎప్పుడు వేరు కాదు. ఆ రెండు పార్టీలు ఒక్కటే.

  1. బీజేపీలో చేరటం వెనుకున్న కారణం ఏంటి? అసలు వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారా లేదా, మీకు టికెట్ ఖాయమైందా?

బాబు మోహన్: బిజెపి పార్టీతో నాకు ముందు ఉంటే సంబంధాలు ఉన్నాయి. నా గురువు నా దైవం అయినటువంటి అన్నగారి మీద అభిమానంతోని టిడిపి పార్టీలకు వచ్చాను. కొన్ని కారణాలవల్ల టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాను నన్ను ఆదరించింది ఇప్పుడు బిజెపి పార్టీ నాకు 200% పార్టీ టికెట్ వస్తుంది. 100% కచ్చితంగా పోటీ చేస్తాను. కచ్చితంగా గెలుస్తాను.

  1. సినిమాల్లో స్టార్ కమెడియన్, మరి అలాంటి మీరు పాలిటిక్స్ లో వెనకబడ్డానికి కారణం ఏంటి? రాజకీయాల్లో మీ అల్టిమేట్ గోల్ ఏంటి?

బాబు మోహన్: నేను ఇప్పటివరకు అంత దూరం ఆలోచించలేదు. పార్టీ ఎలా ఆదేశిస్తే నేను అలా చేస్తూ పోతూ ఉంటాను. నాకు గోలంటూ ఏమి లేదు. నా దేవుడు అన్నగారు సూచించిన మార్గం ఆయన మీద గౌరవంతోనే ఇప్పటివరకు ఆందోళన నియోజకవర్గం లోని ఐదు సార్లు పోటీ చేశాను. పార్టీలు మారచ్చు గుర్తులు మారొచ్చు అంతేకానీ నా స్వభావం నేను చేసేటటువంటి మంచి ఎప్పుడు మారదు.

  1. ఆందోల్ లో జరిగే పార్టీ కార్యక్రమాలు, తెలంగాణ స్టేట్ లెవెల్ లో జరిగే పొలిటికల్ ప్రోగ్రామ్స్ లో మీరు అంటీముట్టనట్టే ఉంటారనేది మీపై ఉన్న అతి పెద్ద కంప్లైంట్, మీ వివరణ ఏంటి, ఎందుకలా జరుగుతోంది.

బాబు మోహన్: పార్టీ కార్యక్రమాలు ఏవి ఉన్నా కచ్చితంగా వెళ్తూ ఉంటాను. నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్నాను. శుభకార్యాలకు అన్నింటికీ ఒకవేళ నేను వెళ్ళాను పరిస్థితుల్లో ఉంటే నా కుమారుడు ఉదయిని పంపిస్తున్నాను. కాకపోతే నాకు తిరగడం ఎక్కువ అవుతుంది. అప్పుడు రాష్ట్ర పార్టీ కాబట్టి రాష్ట్రంలోనే ఉన్నాను. ఇప్పుడు జాతీయ పార్టీ పైనుంచి ఆదేశాలు ఎలా వస్తాయి నేను వాటిని అమలు చేస్తూ వెళ్తున్నాను అంతే తప్ప నియోజకవర్గానికి దూరం ఉన్నాను అనడం అసత్యం. ఒకవేళ నేను దూరంగా ఉన్నప్పటికీ ఎవ్వరైనా సరే నాకు సంప్రదించడానికి ఫోన్ చేస్తే ఎంబడే స్పందిస్తున్నాను నాకు తోచిన అంతవరకు వారికి సహాయపడుతూనే ఉన్నాను.

  1. వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిదని మీ అంచనా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీరిలో గెలుపెవరిదంటారు ?

బాబు మోహన్: బిఆర్ఎస్ పార్టీ లేనే లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఇప్పుడు లేదు బిఆర్ఎస్ అంటేనే విఆర్ఎస్ ప్రజలను పలోభ పెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. కావున ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో నూటికి 200% బిజెపి గెలుస్తుంది. ఆందోల్ నియోజకవర్గం లో వచ్చే ఎన్నికల్లో నేను నూటికి 200% ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నాను. కావున ఆందోల్ నియోజకవర్గం ఉన్నటువంటి చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఆందోలు నియోజకవర్గం లో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీని రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. కాబట్టి ఆందోలులో నేను గెలవడం ఖాయం. రాష్ట్రంలో బిజెపి చక్రం తిప్పడం ఖాయం.

  1. బీజేపీ పొలిటికల్ ప్లానింగ్ ఎలా ఉంటే తెలంగాణలో అధికారంలోకి వస్తుందంటారు. రాష్ట్ర బీజేపీలో ఉన్న లోపాలు, ప్రాబ్లెమ్స్ ఏమిటని విశ్లేషణ

బాబు మోహన్: గెలుపే లక్ష్యంగా,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బిజెపి పార్టీ రాబోయే ఎన్నికలలో ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీలో ఎలాంటి లోపాలు లేవు. ఒకవేళ లోపాలు ఉన్నట్లయితే పార్టీ పెద్దలు వెంబడే చర్యలు చేపట్టి లోపాలను సరి చేసే ప్రయత్నం చేస్తారు. బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికి చేసేటటువంటి ప్లానింగ్స్ గాని కార్యాచరణ కానీ ముందస్తుగా చెప్పదు. కానీ చేస్తుంది.

  1. మీ జన్మించిన స్థలం, విద్యాభ్యాసం, ఉద్యోగం బాధ్యతలు

బాబు మోహన్: నేను జన్మించింది వరంగల్ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో. నా విద్యాభ్యాసం మా అమ్మ వాళ్ళ ఊరు ఖమ్మం జిల్లా కాబట్టి అక్కడే కొనసాగింది. నేను జన్మించింది ఏప్రిల్ 14 సంవత్సరం మాత్రం నాకు తెలియదు. నేను చదువుకుంది ఎంఏ నేను ఉద్యోగం చేసింది రెవెన్యూ ఇన్స్పెక్టర్గా 14 సంవత్సరాలు ఖమ్మం జిల్లాలో పనిచేశాను.

  1. మీరు తినే ఆహారం, మీ అభిరుచులు

బాబు మోహన్: నేను అన్ని రకాల వంటకాలను తింటాను. వంటకాలలో ఎలాంటి ప్రత్యేకత లేదు. కాకపోతే నేను ఎక్కువగా మెలోడీ సాంగ్స్ వింటాను. ఆపదలో ఎవరైనా ఉండి నా తలుపు తడితే మాత్రం నాకు తోచినంత వరకు నేను సహాయపడతా..

  1. మీరు బాధపడిన సందర్భం సంతోష పడిన సందర్భం మా రీడర్స్ కోసం..

బాబు మోహన్: నేను బాధ పడిన సందర్భం మా అమ్మ, నా పెద్ద కుమారుడు పరమపదించినప్పుడు చాలా బాధపడ్డాను, ఇక సంతోషం విషయానికి వస్తే నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భం నా జీవితంలో మర్చిపోలేను. అలాగే మాయలోడు అనే సినిమాను 365 రోజులు తర్వాత హౌస్ ఫుల్ సినిమా చూశాను. అప్పుడు థియేటర్ వాళ్ళు నాతో సినిమా ఇంకా వంద రోజులు ఆడుతుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల థియేటర్ నుంచి తీసివేయడం జరుగుతుంది మీరు సౌందర్య గారు నటన అమోఘం అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News