Balapur Laddu Auction 2025: గణేష్ పండుగంటే గల్లీ నుంచి దిల్లీ వరకు మాములుగా ఉండదు. ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకతను సొంతరించుకుంది. ఇందులోనూ బాలాపూర్ గణేశుడు లడ్డు వేలం రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందింది . ఈసారి ఏకంగా రూ. 35 లక్షల ధర పలికింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు.
గతేడాది కంటే రూ.5 లక్షలు ఎక్కువ: పార్వతీ పుత్రుడి చవితి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గణేష్ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వాటిలో మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేశుడితో పాటు బాలాపూర్ గణపతి యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్ గణనాథుని చరిత్ర ఎంతో ఘనమైనది. లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. అందుకే ఈ రోజు జరిగిన వేలంలో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి రూ. 35 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది కొలను శంకర్ రెడ్డి వేలం పాటలో రూ.30.01 లక్షలకు లడ్డూను దక్కించుకోగా.. ఈ ఏడాది మరింత ధర పలికింది.
బాలాపూర్ చరిత్ర – వేలం పాటకు రికార్డ్స్ బ్రేక్: బాలాపూర్‌లో ప్రతిష్టించే గణపతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘనమైన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే… వారి ఇంట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించినట్లు తెలిపారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానిక వ్యక్తి కొలను మోహన్‌రెడ్డి దక్కించుకున్నారు.
లడ్డు వారింట కొంగుబంగారం: మెుదటిసారి 1994లో లడ్డును పొందిన కొలను మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటుగా.. వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. వారికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డు వారింట కొంగుబంగారం అయ్యింది. బాలాపూర్ లడ్డు పొందడం ద్వారానే కలిసొచ్చిందని వారి నమ్మకం.


