Bandi Nandini Kabaddi : దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ మారుమూల గూడెం. అక్కడ నివసించేది రెక్కాడితే గానీ డొక్కాడని ఓ వ్యవసాయ కూలీ కుటుంబం. ఆ ఇంట్లో పుట్టిన ఓ ఆణిముత్యం, నేడు జాతీయ కబడ్డీ యవనికపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. అడుగడుగునా పేదరికం వెక్కిరించినా, అవేవీ తన లక్ష్యానికి అడ్డుగోడలు కాలేవని నిరూపిస్తూ, కబడ్డీ కోర్టులో మెరుపులు మెరిపిస్తోంది. చదువులో చురుకుదనం, ఆటలో అరివీర భయంకర ప్రదర్శనతో అందరినీ అబ్బురపరుస్తున్న ఆ నల్లమల బిడ్డ బండి నందిని, ఏకంగా భారత అండర్-18 కబడ్డీ శిబిరానికి ఎంపికైంది. అసలు ఈ స్థాయికి చేరడానికి ఆమె పడిన శ్రమ ఎంత..? ఆమె ప్రస్థానం వెనుక ఉన్న కథేంటి..?
అడవిలో పూచిన క్రీడా కుసుమం : నాగర్‌కర్నూల్ జిల్లా, పదర మండలానికి చెందిన బండి రమేశ్, రమాదేవి దంపతుల కుమార్తె నందిని. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అయినా, కూతురి ఆసక్తిని గమనించి చదువుతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించారు.
మన్ననూరు రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నందిని ప్రతిభను అక్కడి ఉపాధ్యాయులు గుర్తించారు. వారు అందించిన ప్రోత్సాహంతో పాటు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కార్యదర్శి యాదయ్య గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు శిక్షణ ఇప్పించారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ, నందిని అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు జాతీయ స్థాయికి చేరింది.
పతకాల పరంపర.. విజయాల ప్రస్థానం : గత కొన్నేళ్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో నందిని సాధించిన విజయాలు ఆమె పట్టుదలకు నిదర్శనం.
2023: గజ్వేల్‌లో జరిగిన జూనియర్ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో, సూర్యాపేట జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొని తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
2024: మహబూబ్‌నగర్‌లో జరిగిన అండర్-19 ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తొలిసారి తన సత్తాను బలంగా చాటింది. అదే ఏడాది సబ్ జూనియర్ విభాగంలో జాతీయ జట్టుకు ఎంపికై ఉత్తరాఖండ్‌లో జరిగిన పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించింది.
2025: ఆమె ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర సబ్‌జూనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. ఉత్తరాఖండ్, బిహార్‌లోని గయాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో జట్టుకు నాయకత్వం వహించి, అత్యుత్తమ ప్రదర్శనతో భారత శిక్షణ శిబిరానికి ఎంపికైంది.
గత నెల 28వ తేదీ నుంచి దిల్లీలోని సోనీపత్‌లో జరుగుతున్న అండర్-18 ఇండియా కబడ్డీ క్యాంపులో నందిని శిక్షణ పొందుతోంది. పేదరికాన్ని, సౌకర్యాల లేమిని జయించి, కేవలం ప్రతిభ, అకుంఠిత దీక్షతో జాతీయ స్థాయికి ఎదిగిన బండి నందిని కథ, ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.


