తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ దాడిలో పిల్లలు, వృద్ధులకు రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటని నిలదీశారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దన్నారు. తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanaka Gandhi)పై బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లిలోని బీజేపీ(BJP) ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్(Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు.