Bandi Sanjay Tweet: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లో రూ.5లకే అన్నపూర్ణ భోజన కేంద్రాలను తిరిగి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. అయితే వీటి పేరును ‘ఇందిరా క్యాంటీన్’గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ పథకం పేరును తీసి ఇందిరా క్యాంటీన్ గా పేరు మార్చడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తెలంగాణలో మార్పు తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ 18 నెలల్లో కేవలం పేర్లు మార్చడమే చేసిందని విమర్శించారు. విశ్వవిద్యాలయాలు పేర్లు మార్పు , ఆసుపత్రులు పేర్లు మార్పు, నీటిపారుదల ప్రాజెక్టులు పేర్లు మార్పు, అవార్డులు పేర్లు మార్పు,ఫ్లైఓవర్లు పేర్లు మార్పు, గృహ నిర్మాణ పథకం పేరు మార్పు, వ్యవసాయ రుణ ప్రోత్సాహకాలు పేర్లు మార్పు, హరితహారం కార్యక్రమం పేరు మార్పు, విభాగాల పేర్లు, అధికారిక నివాసం పేరు మార్పు, తెలంగాణ తల్లి మారింది అని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం సిగ్గులేకుండా రూ.5 భోజన పథకానికి పేరును దైవిక దాత అన్నపూర్ణ దేవత నుంచి ఇందిరా గాంధీగా మార్చారని ధ్వజమెత్తారు. ఇది పాలన కాదు.. హిందూ విశ్వాసాలకు అవమానం అని ఫైర్ అయ్యారు.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేట్ హైదరాబాద్ లో పేదల ఆకలిని తీర్చేందుకు ‘అన్నపూర్ణ భోజన పథకం’ రూ.5లకే మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్లు నిర్వహణ సరిగా లేక మూతపడ్డాయి. తాజాగా ఈ పథకానికి ఇందిరా క్యాంటీన్‌గా పేరు మార్చుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే లభించేది. కానీ ఇకపై ఉదయం పూట టిఫిన్ కూడా అందించనున్నారు.