మాజీ సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) లేఖ రాయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాన్నకు లేఖ వ్యవహరంలో కవితను కాంగ్రెస్ వదలిన బాణంగా అభివర్ణించారు. కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని, తెలంగాణ ప్రజలు దీనిని పట్టించుకోవడం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ వ్యక్తిగత, కుటుంబ సంక్షోభాలను ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, మద్యం మాఫియా, భూకబ్జాలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలను ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి, పారదర్శక పాలన, అవినీతి రహిత పరిపాలన అందిస్తుందని సంజయ్ హామీ ఇచ్చారు.