Bandi Sanjay Comments On State Preisdent: రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరైనా అడగవచ్చు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధిష్ఠానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలేదని తెలిపారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన ఏ నాయకుడు డమ్మీ కాదని.. ఎవరిని ఎక్కడ వినియోగించుకోవాలో పార్టీకి తెలుసుని తెలిపారు. బండి సంజయ్ ఉన్నా.. లేకపోయినా.. పార్టీ కార్యకలాపాలు ఆగవని అని స్పష్టం చేశారు.
అధిష్ఠానం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చెబితేనో.. మరెవరో చెబితేనో అధ్యక్షుడని ఎంపిక చేసే పార్టీ బీజేపీ కాదన్నారు. అధిష్టానం నిర్ణయానికి కార్యకర్తలు, నాయకులు కట్టుబడి ఉండాలని చెప్పుకొచ్చారు. ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టింగ్ లు పెట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బీసీలకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వలేని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని.. మరి ఆ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో బీసీ బిడ్డలమైన తనకు, లక్ష్మణ్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన సంగతి గుర్తులేదా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ఆయన వెల్లడించారు.
కాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద బాధ్యత తనకు ఇచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు విసిగిపోయారన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీలోని ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్తానని రామచందర్ రావు స్పష్టం చేశారు.