Bandi Sanjay vs KTR Defamation suit: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్‌లో ప్రధాన అంశాలు పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఫోన్‌లు ట్యాప్ చేశారని నిందితులు పేర్కొన్నారని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. అయితే రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఏంటనేది తనకు తెలియదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-on-land-acquisition-farmers-issue/
ఈ మేరకు రాష్ట్రాన్ని సుసంపన్న రాష్ట్రంగా కేటీఆర్ మార్చారన్న పిటిషనర్ వాదనను బండి సంజయ్ తోసిపుచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పులు భారీగా పెరగడంతో పాటు పెండింగ్ బిల్లులు కూడా పెరిగాయని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో కోర్టు ఇంజక్షన్ మంజూరు చేస్తే అది వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగిస్తుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై తన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని వాదించారు. కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఆదేశించారని ఆరోపించారు. పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. అంతే కాదు క్షమాపణలు కూడా చెప్పడానికి నిరాకరిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు.


