Monday, March 17, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై.. బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం..!

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై.. బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ లో ఆర్యవైశ్య పట్టణ సంఘం నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అని కొనియాడారు. ఆయన పేరును తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

- Advertisement -

సురవరం ప్రతాపరెడ్డి పట్ల తమకు గౌరవం ఉందని, తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టుకోవచ్చని సూచించారు. అయితే, పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం సరికాదని, సీఎం రేవంత్ రెడ్డి తన కుల అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సీఎం తీరు దేశభక్తులను, స్వాతంత్ర్య సమరయోధులను, ఆర్యవైశ్యులను అవమానించేలా ఉందని విమర్శించారు.

పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరుడని, గొప్ప దేశభక్తుడని, స్వాతంత్ర్య సమరయోధుడని, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులను వదులుకుని దేశం కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని, సత్యాగ్రహ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3 సార్లు జైలు శిక్ష అనుభవించారని, హరిజనోద్యమం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మహనీయులను అవమానించడం అలవాటని, అంబేద్కర్ ను కూడా అడుగడుగునా అవమానించారని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డికి.. ఎన్టీఆర్ పార్క్, కాసు బ్రహ్మనందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లతో ఉన్న పార్కులు, కోట్ల విజయభాస్కర్ స్టేడియం పేర్లు మార్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలను కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకుని పొట్టి శ్రీరాములు పేరును యధాతథంగా తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని, ఆర్యవైశ్య సమాజానికి, దేశభక్తులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు నగనూరి రాజేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News