పహల్గాం ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. గత 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణమంత్రి అంగీకరించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి నియామక పత్రాలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని అన్నారు. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు భారతీయులంతా అండగా నిలవాలని కోరారు. అమాయక టూరిస్టుల ప్రాణాలు తీసిన పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు తగిన మూల్యం చల్లించుకోక తప్పదని హెచ్చరించారు.