ఢిల్లీ లిక్కర్ కేసులో జైల నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇటీవల తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే బీసీ కార్డు అందుకున్నారు. బీసీ హక్కుల సాధన పేరుతో రాజకీయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత బీసీల గురించి మాట్లాడటంపై స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ బండ్రు శోభరాణి(Bandru Shobharani)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బీసీలను నిర్లక్ష్యం చేసిన మీరా బీసీల గురించి మాట్లాడేదంటూ మండిపడ్డారు.
బీసీల పట్ల మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ ఎత్తివేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పునరుద్ధరించిన ధర్నాచౌక్ వద్ధ కవిత ధర్నాకు సిద్ధపడ్డారని ఎద్దేవా చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులు లేనట్లుగా బీసీ కాని కవిత బీసీ జపం చేస్తూ ఆ పార్టీ బీసీ నాయకులను సైతం అవమానిస్తుందన్నారు. బీసీల హక్కుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే పీసీసీ చీఫ్‌గా బీసీని నియమించిందని.. కుల గణన నిర్వహించిందని శోభారాణి గుర్తు చేశారు.