Saturday, November 23, 2024
HomeతెలంగాణBansuvada: చందూరు ఎత్తిపోతల పనులు ప్రారంభం

Bansuvada: చందూరు ఎత్తిపోతల పనులు ప్రారంభం

చందూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా ఈరోజు పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. అనంతరం వర్నీ మండలం లోని జాకోర ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించిన సభాపతి పోచారం. ఈ కార్యక్రమంలో RDO రాజేశ్వర్, సాగునీటి శాఖ CE శ్రీనివాస్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సాగునీటి శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మీడియాతో మాట్లాడుతూ… నీళ్ళు ఉంటే లక్ష్మీ ఉంటుందని, తెలంగాణ రైతులకు నీళ్ళు, కరంటు అందిస్తే బంగారు పంటలు పండిస్తారన్నారు. తను ఏ పంట పండించినా పది మందికీ పంచే గుణం రైతుదని, కోటీశ్వరుడు అయినా రైతులు పండించిన అన్నం తినాల్సిందేనన్నారు పోచారం.

- Advertisement -

రైతుల కన్నీళ్లు తుడవడానికి, భూములకు సాగునీరు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేశారని, తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్నది నేడు నిజమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేకుండా ఆత్మగౌరవంతో బతికే రోజులు వస్తున్నాయని, ప్రభుత్వాల చేతగాకనే దేశంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. రైతుల కరువుతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. నదులలో లభ్యమయ్యే నీటిని ప్రాజెక్టులు నిర్మించి సాగుకు అందిస్తే కరువు ఉండదు, బంగారు పంటలు పండిస్తారని పోచారం అన్నారు.

ఆలోచన కలిగిన వ్యక్తులే పరిపాలన చేస్తారు.అలాంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న పోచారం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని 600 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తున్నారన్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తది, పాతది కలిపి 40లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపకల్పన చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కొంతమంది అడ్డుతగులుతున్నారు. ఈ పథకం పూర్తయితే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, గతంలో వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు నేడు రివర్స్ వలసలు వస్తున్నారన్నారు. గత వారం మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను సందర్శించానని చెప్పుకొచ్చిన పోచారం, మల్లన్న సాగర్ నుండి హల్ధీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి నీళ్ళు వస్తే డోకా లేదన్నారు.

నిజాంసాగర్ 365 రోజులు నిండు కుండలా ఉంటుందని, బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 1.50 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయన్నారు. ఇందులో లక్ష ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో, మరో 25,000 ఎకరాలు చెరువులు, బోర్లు, మంజీర నది వెంట సాగులో ఉన్నదని, మిగిలిన 25,000 ఎకరాల మెట్ట ప్రాంత భూములకు సాగునీరు అందించడానికి సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర-చందూరు- చింతకుంట ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నట్టు వివరించారు. అడగగానే ఈ రెండు పథకాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. జాకోర-చందూరు-చింతకుంట ఎత్తిపోతల పథకం తో 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా మరో 15,000 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. జాకోర-చందూరు-చింతకుంట ఎత్తిపోతల పథకంలో మొత్తం 26 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తారని, సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర-చందూరు-చింతకుంట ఎత్తిపోతల పథకాల ఖర్చు 350కోట్ల రూపాయలు, మొత్తం 25,000 ఎకరాల భూమి సాగవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

ఈ 25,000 ఎకరాలలో ఏటా 250 కోట్ల రూపాయల పంటలను రైతులు పండిస్తారని, ఈరోజు చందూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా మొదటి పైప్ లైన్ వేయడాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. జూన్ నాటికి పూర్తయ్యే విదంగా పనులు వేగంగా జరుగుతున్నాయని, మంజీర నదిపై మొత్తం నాలుగు చెక్ డ్యాంలు నిర్మిస్తామన్నారు. ఇందులో బాన్సువాడ పట్టణం సమీపంలోని చెక్ డ్యాం నిర్మాణం పూర్తయింది, 6 కిలోమీటర్లు నీళ్ళు ఆగాయని, ఈ చెక్ డ్యాం నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రూ. 35 కోట్లతో బీర్కూరు వద్ద మరో చెక్ డ్యాం నిర్మాణంలో ఉన్నదని, మరో రెండు చెక్ డ్యాం లను కొడిచర్ల, సుంకిని వద్ద నిర్మించనున్నట్టు తెలిపారు. వృథాగా పోతున్న నీటిని చెక్ డ్యాం ల ద్వారా ఆపడం వలన పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి వసతి కలుగుతుందన్నారు పోచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News