Saturday, November 15, 2025
HomeTop StoriesBathukamma: పల్లె నుంచి ప్రపంచ వేదిక వరకు.. ఎవరీ బతుకమ్మ..? ఎందుకు జరుపుకుంటారు?

Bathukamma: పల్లె నుంచి ప్రపంచ వేదిక వరకు.. ఎవరీ బతుకమ్మ..? ఎందుకు జరుపుకుంటారు?

Telangana Culture and Tradition: బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ బతుకమ్మ పండుగ ఆ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ఒక ప్రతీక. ఏ పండుగ అయినా జరుపుకునే ముందు దాని పూర్వాపరాలు తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ పండుగ వేడుకలను కూడా పూర్తిగా ఆనందించవచ్చు. అయితే బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న కారణాలేమిటో తెలుసుకుందాం

- Advertisement -

రంగురంగుల పూలతో బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంబరాలు భాద్రపద బహుళ అమావాస్య అంటే మహాలయ అమావాస్య (పెత్రామస) నుంచి ప్రారంభమై.. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) రోజున సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ వలయాకారంగా తిరుగుతూ, పాటలు పాడుతూ మహిళలు ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పండుగలో ప్రతి రోజు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఒక్కో రోజు అమ్మవారికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు.

బతుకమ్మ పండుగ – రోజువారీ విశేషాలు:

  • మొదటి రోజు – ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్యతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. దీనిని ‘పెత్రామస’ అని కూడా పిలుస్తారు. ఈ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలతో నైవేద్యం చేస్తారు.
  • రెండో రోజు – అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ రోజు, సప్పిడి పప్పు, బెల్లం, అటుకులను కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
  • మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ: ఈ రోజు ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
  • నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ: నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి అమ్మవారికి నివేదిస్తారు.
  • ఐదో రోజు – అట్ల బతుకమ్మ: ఈ రోజు బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు.
  • ఆరో రోజు – అలిగిన బతుకమ్మ: ఆశ్వయుజ పంచమి నాడు ఈ రోజును ‘అలిగిన బతుకమ్మ’గా భావిస్తారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారని నమ్మకం. నైవేద్యం ఏమీ తీసుకోరని నమ్ముతారు. అందుకే ఏమీ సమర్పించరు.
  • ఏడో రోజు – వేపకాయల బతుకమ్మ: ఈ రోజు వేపపండ్ల ఆకారంలో బియ్యం పిండితో చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు.
  • ఎనిమిదో రోజు – వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లంతో కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు.
  • తొమ్మిదో రోజు – సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి అంటే దుర్గాష్టమి రోజున పండుగ ముగుస్తుంది. ఈ రోజు ఐదు రకాల నైవేద్యాలను తయారు చేస్తారు: పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, మరియు నువ్వులన్నం. ఈ ఐదు రకాల సద్దులను అమ్మవారికి సమర్పించి పండుగను ముగిస్తారు.

 పల్లె నుంచి ప్రపంచ వేదిక వరకు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పండుగ ఒక కీలక పాత్ర పోషించింది. ఉద్యమకారులు తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి బతుకమ్మతో ఊరేగింపులు నిర్వహించి.. నాయకులలో స్ఫూర్తి నింపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివసించే తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశిద్దాం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad