Bathukamma Festival in Guinness Book: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకోవాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను తయారు చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కేలా ప్రణాళికలు రచిస్తున్నామని సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని గుర్తు చేశారు.
సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో ఘనంగా వేడుకలు..
సెప్టెంబర్ 21 నుండి 30 వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 21న వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి వద్ద ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సెప్టెంబర్ 22 నుండి 26 వరకు ప్రతి రోజూ రెండు జిల్లాల్లో అధికారికంగా బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. సెప్టెంబర్ 27 నుండి 30 వరకు హైదరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతిని విదేశీయులకు సైతం తెలియజేసేలా విమానాశ్రయంలోనూ ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది పండుగ కోసం ప్రత్యేకంగా కవులు, కళాకారులు, రచయితలతో బతుకమ్మ పాటలు రాయిస్తున్నారు. బతుకమ్మలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా, నీటిలో నిమజ్జనం చేయాలని మహిళలకు మంత్రి జూపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
https://teluguprabha.net/national-news/epfo-single-login/
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ..
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం శుభపరిణామం. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళందరికీ నాణ్యమైన చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ శ్రేణులు తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పండుగను ఘనంగా నిర్వహించాలని కోరుతున్నా.” అని పేర్కొన్నారు. ఇక, మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటను కాపాడేందుకు తాను ఎంతో పోరాటం చేశానని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, ఆ కుంటను కబ్జా నుంచి రక్షించారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 25న బతుకమ్మ కుంటలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ కుంట కబ్జాకు గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కబ్జాదారుల నుంచి విడిపించినందుకు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. దేశదేశాల్లో బతుకమ్మ ఆడిన కవితకు బతుకమ్మ కుంట కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, కాంగ్రెస్ నేతలు కైలాష్, ఇందిరా శోభన్, సరితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


