అమెరికాలో అన్ని రంగాల్లో ప్రవాస భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. వ్యాపార, రాజకీయ రంగాల్లో ఇప్పటికే తమదైన ముద్ర వేశారు. ఇక అక్కడ జరిగిన అందాల పోటీల్లోనూ ఓ ఎన్నారై సత్తా చాటింది. అందులోనూ మన తెలంగాణకి చెందిన తెలుగమ్మాయి కావడం విశేషం. తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన బావండ్ల రిషిత (Bavandla Rishitha ) కు మిస్ ఫిలాంత్రఫీ యూనివర్స్ 2024-2025 అవార్డు లభించింది.
ఈ నెల 11న వాషింగ్టన్ లో జరిగిన అందాల పోటీలో పాల్గొని, నిన్న గురువారం అవార్డు అందుకున్నట్లు ఆమె తండ్రి మాణిక్యం తెలిపారు. కాగా, బావండ్ల రామ లచ్చయ్య, సత్యమ్మ దంపతుల మూడో కుమారుడే బావండ్ల మాణిక్యం. 14 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇప్పుడు వారి కుమార్తె బావండ్ల రిషిత (Bavandla Rishitha ) అందాల పోటీల్లో అవార్డు దక్కించుకున్నారు.