Heavy rains in Telugu states : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రుతుపవనాల గమనాన్ని శాసిస్తూ, తీరానికి దగ్గరగా కేంద్రీకృతమైన ఈ వాతావరణ మార్పు.. రానున్న మూడు రోజులు కుండపోత వర్షాలకు కారణం కానుందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు మొదలవగా, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంతకీ ఈ అల్పపీడనం ప్రభావం ఏయే జిల్లాలపై అధికంగా ఉండనుంది..? ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమిటి..? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
కల్లోలానికి కారణమిదే : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి అల్పపీడనంగా బలపడింది. రాగల 48 గంటల్లో ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ఈ వాతావరణ వ్యవస్థల కలయిక ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు రంగం సిద్ధమైంది.
తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో వణుకు : అల్పపీడన ప్రభావం తెలంగాణపై అధికంగా కనపడనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
రెడ్ అలర్ట్: సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఆరెంజ్ అలర్ట్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హనుమకొండ, వరంగల్, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమై, రాబోయే 36 గంటలపాటు అత్యంత కీలకమని అధికారులు హెచ్చరించారు. నగరంలో 150-250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగాన్ని 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించగా, పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యలు, వరద నీరు నిలిచిపోకుండా ఉండేందుకు హైడ్రా (HYDRA) బృందాలు రంగంలోకి దిగాయి.
కోస్తా, రాయలసీమల్లో కుండపోత : ఆంధ్రప్రదేశ్‌పైనా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రధానంగా ప్రభావితమయ్యే జిల్లాలు: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
తీరంలో అలజడి: సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


