BC JAC bandh continue in telangana: 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ను ప్రశాంతంగా పాటిస్తున్నాయి. బంద్‌లో అధికార పార్టీతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. అంతే కాకుండా పలు కులసంఘాలు సైతం బంద్‌కు పూర్తిగా మద్దతు ప్రకటించాయి.
బంద్‌లో పాల్గొన్న ఎంపీ ఈటల: రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బంద్ కారణంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, చెంగిచర్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వద్ద జరిగిన ధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ వద్ద బీసీ జేఏసీ నేతలు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. బీసీ జేఏసీ బంద్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్, వికారాబాద్ ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగి.. తమ వాటా తమకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలు సైతం తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
డీజీపీ కీలక ఆదేశాలు: మరోవైపు బంద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. బంద్ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే.. చట్టం ప్రకారం అత్యంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను పోలీస్ శాఖ ఏమాత్రం సహించదని డీజీపీ స్పష్టం చేశారు.


