Durga Puja unique traditions : శరన్నవరాత్రులొచ్చాయంటే చాలు, సింహవాహినియై దుష్టసంహారం చేస్తున్న దుర్గామాత రూపమే మన కళ్లముందు కదలాడుతుంది. కానీ, పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మాత్రం అమ్మవారు సింహానికి బదులుగా పులిపై ఆశీనురాలై దర్శనమిస్తుంది. రెండు శతాబ్దాలుగా ఓ జమీందారీ కుటుంబం పాటిస్తున్న ఈ వింత ఆచారం వెనుక ఉన్న కథేంటి..? దుర్గమ్మ వాహనం సింహం కాకుండా పులిగా మారడానికి కారణమేంటి..?
రెండు శతాబ్దాల సంప్రదాయం : 19వ శతాబ్దంలో బెంగాల్‌ను ఏలిన భూస్వాములు, రాజకుటుంబాలు దుర్గా పూజను అత్యంత వైభవంగా నిర్వహించేవి. వాటిలో, బంకురా జిల్లాలోని అయోధ్య గ్రామంలో జమీందార్ రామ్మోహన్ బెనర్జీ ప్రారంభించిన పూజ ఎంతో ప్రసిద్ధి చెందింది. 200 ఏళ్లు గడిచినా, ఆయన వారసులు నేటికీ అదే సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఈ పూజను కొనసాగిస్తున్నారు.
పులిపై చండీధారి : ఈ కుటుంబం పూజించే దుర్గాదేవి విగ్రహం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు సింహంపై కాకుండా, పులిపై కూర్చుని ఉంటుంది. స్థానికంగా ఈ అమ్మవారిని ‘చండీధారి’ అని భక్తితో పిలుచుకుంటారు. వెండి పల్లకీలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారు. నిమజ్జనం రోజున కూడా నవపత్రికలను వెండి పల్లకీలోనే భైస్ ఘాట్‌కు తరలించడం ఇక్కడి ఆనవాయితీ.
ఈ వింత ఆచారం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. ఎస్టేట్ స్థాపకుడు రామ్మోహన్ బెనర్జీ, ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని, శక్తిని చాటిచెప్పేందుకు, బెంగాల్ అడవులకు ప్రతీక అయిన పులిని అమ్మవారి వాహనంగా ఎంచుకున్నారని చెబుతారు.
“ఈ పూజ ప్రారంభించినప్పుడు, విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉండాలని రామ్మోహన్ బెనర్జీ కోరుకున్నారు. అందుకే, ఇక్కడ విగ్రహం ముఖాన్ని శిల్పులు చెక్కరు. మా వంశపారంపర్య కళాకారులే తమ చేతులతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దుతారు. బంకురా జిల్లాలో ఇలాంటి విగ్రహం మరొకటి లేదు.”
– మనోహర్ బెనర్జీ, జమీందారీ కుటుంబ సభ్యుడు
తగ్గిన వైభవం.. తరగని భక్తి : “చిన్నప్పటి నుంచి ఈ పూజ గొప్పతనాన్ని చూస్తున్నాను. మా తాత, తండ్రి ఎంతో వైభవంగా చేసేవారు. ఆర్థిక కారణాల వల్ల ఇప్పుడు ఆ వైభవం తగ్గినా, అప్పటి ఆచారాలను యథాతథంగా పాటించేందుకు ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్ తరాలు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించేలా చూస్తాం,” అని కుటుంబ సభ్యురాలు సుమంత బెనర్జీ తెలిపారు. ఈ కుటుంబ సభ్యులు చాలామంది దేశవిదేశాల్లో స్థిరపడినా, దుర్గా పూజ సమయంలో మాత్రం అందరూ తప్పనిసరిగా సొంతూరికి చేరుకుని, పండుగను కలిసి జరుపుకుంటారు.
కాశీలో చంద్రకూపం.. పితృదేవతలకు శాంతి : ఇదిలా ఉండగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి (కాశీ)లో ఉన్న ‘చంద్రకూపం’ (చంద్ర తీర్థం) అనే బావికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ బావి నీటితో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం విడిస్తే, గయలో శ్రాద్ధం చేసినంత పుణ్యం లభిస్తుందని, వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడు తన శాప విమోచనం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి, ఈ బావిని తవ్వించాడని పురాణ కథనం.


