బెట్టింగ్ యాప్స్(Betting Apps) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)కు బదిలీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పెద్ద దందాగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులన్నింటినీ సమగ్ర దర్యాప్తు కోసం SITకు బదిలీ చేస్తున్నట్లు సమాచారం అందించారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసును సిట్‌కు బదిలీ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ కేసులను SITకు బదిలీ చేయడంతోమరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇప్పటివరకు 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించిన విషయం విధితమే.