Nationwide vehicle registration : ఉద్యోగరీత్యా తరచూ రాష్ట్రాలు మారుతున్నారా? ప్రతిసారీ మీ కారు, బైక్‌ను రీ-రిజిస్ట్రేషన్ చేయించలేక తల పట్టుకుంటున్నారా? ఆఫీసు పనుల కన్నా ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగడమే పెద్ద పనిగా మారిందా? ఇక ఆ చింత అవసరం లేదు. దేశమంతా ఒకే నంబర్‌తో స్వేచ్ఛగా తిరిగేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భారత్ సిరీస్’ (BH) గురించి మీకు తెలుసా..? అసలు ఈ సిరీస్ వల్ల లాభాలేంటి..? ఎవరు అర్హులు? ఎలా పొందాలి?
ఏమిటీ ‘భారత్ సిరీస్’ : దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా వాహన రిజిస్ట్రేషన్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేకుండా, 2021లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ‘భారత్ సిరీస్’ను అందుబాటులోకి తెచ్చింది. ఇది వాహనదారులకు దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపును ఇస్తుంది.
నంబర్ ప్లేట్ ఇలా ఉంటుంది:
25 BH 1234 G
25: వాహనం రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరం (ఉదా: 2025)
BH: భారత్ సిరీస్ అని సూచిస్తుంది
1234: వాహన నంబరు
G: ప్రత్యేక కోడ్
ప్రధాన ప్రయోజనం – బదిలీ భయం లేదు : సాధారణంగా ఒక రాష్ట్రంలో కొన్న వాహనాన్ని మరో రాష్ట్రానికి తీసుకెళ్లి ఏడాదికి మించి ఉపయోగించాలంటే, అక్కడ తప్పనిసరిగా రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది చాలా శ్రమతో, ఖర్చుతో కూడుకున్న పని. బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ఉంటే ఈ అవస్థ తప్పుతుంది.
ఉదాహరణకు, భారత సైన్యంలో పనిచేసే ఓ ఉద్యోగి కోల్‌కతాలో బీహెచ్ సిరీస్‌తో వాహనం కొన్నారు. పదవీ విరమణ తర్వాత నిర్మల్‌కు వచ్చినా, ఆయన ఇక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం రాలేదు.
పన్ను చెల్లింపులో వెసులుబాటు : సాధారణ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌కు 15 ఏళ్ల రోడ్డు పన్నును ఒకేసారి చెల్లించాలి. కానీ, బీహెచ్ సిరీస్ వాహనాలకు ప్రతి రెండేళ్లకు ఒకసారి పన్ను చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇది వాహనదారులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా చేస్తుంది.
ఎవరు అర్హులు : ఈ సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. రక్షణ శాఖ సిబ్బంది. కనీసం నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు.
పొందడం ఎలా : బీహెచ్ సిరీస్ నంబర్‌ను కొత్త, పాత వాహనాలకు పొందవచ్చు.
కొత్త వాహనానికి: వాహనం కొనేటప్పుడే డీలర్‌కు బీహెచ్ సిరీస్ కావాలని చెబితే, వారే ‘వాహన్’ పోర్టల్ ద్వారా మీ తరఫున దరఖాస్తు చేస్తారు.
పాత వాహనానికి: ఇప్పటికే వాహనం ఉన్నవారు నేరుగా ‘వాహన్’ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, తాము అర్హులమని రుజువు చేసేందుకు అవసరమైన అధికారిక ఐడీ కార్డు, ఇతర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం మీద, బీహెచ్ సిరీస్ అనేది తరచూ బదిలీలపై వెళ్లే ఉద్యోగులకు ఒక వరం లాంటిది. ఇది దేశంలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ, వాహనదారులకు అనవసరమైన తిప్పలు, ఖర్చులు లేకుండా ఎనలేని సౌకర్యాన్ని కల్పిస్తోంది.


