బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు రాష్ట్రానికి దూరంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం ఆయన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మంచి పనులు చేసిన ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రోడ్డు మీదకు వచ్చి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్ళు లాంటివి అని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, పేద, మధ్య తరగతి ప్రజల వైద్య అవసరాలు తీర్చడం కోసం ప్రజా ప్రభుత్వం కావాల్సిన నిధులను విడుదల చేస్తోందని వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం వల్ల రాష్ట్రంలోని పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు సంతోషంగా ధైర్యంగా జీవించగలుగుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పిస్తూ, డాక్టర్లకు, సిబ్బందికి ప్రతినెలా జీతాలు ఇస్తూ, వైద్య విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందిస్తూ… ప్రజా ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతున్నదని చెప్పడానికి గర్వంగా ఉందని భట్టి విక్రమార్క వెల్లడించారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను, ఆరోగ్యశ్రీ గురించి పట్టించుకోలేదు, డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, సిబ్బంది నియామకాన్ని విస్మరించారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయి సంవత్సరం కూడా ఉండలేక రోడ్డు మీదకు వచ్చి బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వం పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో 10 ఏళ్లకు పైగా పరిపాలన చేసిన BJP, తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన BRS పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయలేదు. కానీ వారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రజా ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేల్చడం విడ్డూరంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు.