ప్రజలు చెల్లించే పన్నులతో ఖజానానుంచి జీతాలు తీసుకునే పోలీసు అధికారులు సైతం ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జమ్మికుంట మండలంలోని శంభునిపల్లి, క్రాస్ రోడ్ నుండి మొదలై.. తనుగుల, గండ్రపల్లి నాగంపేట శాయంపేట ధర్మారం, కొత్తపల్లి మడిపల్లి, గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతినగర్ వరకు కొనసాగింది. సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకు గ్రామ గ్రామాన మహిళలు మంగళ హారతితో స్వాగతం పలుకుతూ తమ తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
నాగంపేట గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు రాకపోగా రాకరాక నోటిఫికేషన్లు వస్తే ప్రశ్నాపత్రాల లీకేజీ చేసి వాళ్లకు సంబంధించిన మనుషులకు అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండ్లు లేవు, పేద వర్గాలకు భూ పంపిణీ లేదు. నిత్యావసన సరుకుల ధరలను మాత్రం విపరీతంగా పెంచడం విడ్డూరంగా ఉందన్నారు. ధరలను నియంత్రణ చేసే వ్యవస్థ లేదన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ బల్మూరు వెంకట్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి కాంగ్రెస్ నాయకులు సాయిని రవి, పుల్లూరు సదానందం, పూజారి శివ, గూడెపు సారంగపాణి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.