Sunday, November 16, 2025
HomeతెలంగాణFunds for Young Inda School: యంగ్ ఇండియా స్కూల్స్‌కు నిధులివ్వండి

Funds for Young Inda School: యంగ్ ఇండియా స్కూల్స్‌కు నిధులివ్వండి

Bhatti Vikramarka: రాష్ట్ర విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటుతోపాటు దీనికి సంబంధించిన పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్‌బీఎం నిధుల విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు భట్టి, తుమ్మల మాట్లాడుతూ తెలంగాణలో విద్యా నాణ్యత, పిల్లల పోషకాహార లోపం అనే రెండు కీలక సవాళ్లను అధిగమించడానికి యంగ్ ఇండియా స్కూల్స్ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారని, వీరిలో 56.33 శాతం బీసీలు, 17.43 శాతం ఎస్సీలు, 10.45 శాతం ఎస్టీలు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం అనేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసినప్పటికీ, అవి సరైన మౌలిక సదుపాయాలు లేకుండా అద్దె భవనాల్లో నడుస్తున్నాయని వివరించారు.

- Advertisement -

రూ.30 వేల కోట్లతో అత్యాధునిక క్యాంపస్‌లు
ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం 105 అత్యాధునిక రెసిడెన్షియల్ క్యాంపస్‌లను నిర్మించాలని యోచిస్తోంది. ఒక్కో పాఠశాలలో 5 నుంచి 12వ తరగతి వరకు 2,560 మంది విద్యార్థులు చదవన్నట్లు మంత్రులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 2.7 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేకంగా 4 లక్షల మంది విద్యార్థులకు పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.21 వేల కోట్లు క్యాంపస్‌ల నిర్మాణానికి, రూ.9 వేల కోట్లు విద్యా రంగంలో అనుబంధ పెట్టుబడులకు ఉపయోగపడతాయన్నారు. ఈ భారీ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇది మానవ వనరుల అభివృద్ధిలో దీర్ఘకాలిక పెట్టుబడి అని, తద్వారా సామాజిక, ఆర్థిక రాబడి అనేక రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలు కేవలం భవనాల నిర్మాణం కాకుండా, బహుళ విభాగ అభ్యాసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత తరగతి గదులు, ప్రయోగశాలలు, బలమైన పోషకాహార సేవలు, క్రీడలు, కళలు లాంటి సౌకర్యాలను అందిస్తాయని వివరించారు. యంగ్ ఇండియా స్కూల్స్ ప్రోగ్రాంతోపాటు మంత్రులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం అధిక వడ్డీకి తీసుకున్న రుణాల విషయంలో సడలింపు, రుణాల పునర్ నిర్మాణం (లోన్ రీస్ట్రక్చరింగ్) చేయాలని కోరారు. అలాగే, రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తృతంగా ఉన్నందున, పామాయిల్‌పై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారని, సుంకాన్ని పెంచాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad