తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. జగదీష్ రెడ్డి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసి.. కమిటీ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. నిండు సభలో దళితుడైన స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి చులకనగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) మీకు నేర్పిన సంస్కారం ఇదేనా ? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టుగా చేసిన వ్యాఖ్యలను సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్పారని పేర్కొన్నారు. సభ సాంప్రదాయాలు కాపాడటానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ప్రకారం జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కొంతమంది సభ్యులు కోరారు.