నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని, ఆ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్ కి తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ తమ రాజకీయ విధానాలు, తెలంగాణలో బహుజనులకు దళితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు. దళిత బంధు పథకాన్ని ఆజాద్ ప్రశంసించారు.
అనంతరం వారిద్దరూ కలిసి సచివాలయం వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించారు. అంబేద్కర్ కి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత అమర జ్యోతి వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…..తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించడంతో పాటు సీఎం కేసీఆర్ ను కలుసుకోవడానికి ఆహ్వానించామని, ఆహ్వానాన్ని మన్నించి రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ కు కవిత కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో అందరూ చరిత్రను మరిపించే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణలో చరిత్రను శాశ్వతంగా ఉంచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చంద్రశేఖర్ ఆజాద్ అనడం సంతోషంగా ఉందని తెలిపారు. వెనుకబడిన వర్గాల కోసం ఆజాద్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల అండ ఉంటుందని, అటువంటి పోరాటాల్లో తాము కలిసి వస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కేసీఆర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటారని వివరించారు. ఆజాద్ వంటి భావసారూప్యత కలిగిన వారితో తమ కలిసి నడుస్తామని ప్రకటించారు.
పార్లమెంటులో ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడంతోపాటు నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని ఆజాద్ చేస్తున్న డిమాండ్ కు తాము అండగా నిలుస్తామని చెప్పారు. డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న పోరాటానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు.
అట్టడుగు వర్గాల కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం: ఆజాద్
నూతన పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం రాకముందు అంబేడ్కర్ తో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు కూడా వాళ్లకే ఇబ్బందులు ఉన్నాయని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడాన్ని స్వాగతించిన చంద్రశేఖర్ ఆజాద్ బీఆర్ఎస్ దేశంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తాను ఢిల్లీలో నిరసన తెలిపినప్పుడు బీఆర్ఎస్ ఎంపిలను వచ్చి మద్దతు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. నూతన సచివాలయానికి కూడా అంబెడ్కర్ పేరు పెట్టారు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంత ప్రేమ చూపినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.
మణిపూర్ ఘటన దేశంలో అత్యంత దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ మహిళ కు కూడా జరగకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.