తెలంగాణ ముద్దుబిడ్డ తొలి తెలుగు ప్రధాని బహుభాషా కోవిదులు అపర మేధావి ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న లాంటి అత్యుత్తమ అవార్డు ప్రకటించడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పీవీ నరసింహారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర అనే గ్రామంలో జన్మించినప్పటికీ, ఆయన రాజకీయ ఓనమాలు దిద్దుకున్నది మాత్రం మంథని నియోజక ఒక వర్గం నుండే కావటం విశేషం.ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంథని నియోజక వర్గానికి చెందిన ఐదు మండలాలు విలీనమయ్యాయి. దీంతో పివి నరసింహారావుకు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నప్పుడు మంథని నియోజకవర్గంతో పేగు బంధం లాంటి అనుబంధం ఉండేది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత హన్మకొండ పార్లమెంటు పరిధిలో వచ్చే భూపాలపల్లి ప్రాంతం ఆయనకు సుపరిచితమే!ఇటు భూపాలపల్లి అటు మంథని నియోజకవర్గాలతో దశాబ్దాల సాన్నిహిత్యం ఆయన సొంతం. ఈ రెండు ప్రాంతాల అభివృద్ధిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. మంథని నుండి మహాదేవపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో మానేరుపై వంతెన నిర్మించి మహాదేవపూర్ ప్రాంతానికి రవాణా సౌకర్యం అప్పట్లో కల్పించారు. భూపాలపల్లి నుండి ఆజంనగర్ అటవీ గ్రామాలకు ఆయన హనుమకొండ నుండి ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రవాణా సౌకర్యం కల్పించారు. ఈ రెండు నియోజకవర్గాల గ్రామాలకు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డారు. అలాంటిమహనీయునికి భారతరత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది