వికారాబాద్ జిల్లాలోని మర్పల్లిమండలం మొగిలిగుండ్లలోని పొలాల్లో ఆకాశం నుండి ఓ వింతవస్తువు పడింది. దానిని చూసిన స్థానికులు ఇదేదో అనుమానాస్పదంగా ఉందంటూ భయాందోళనలకు గురయ్యారు. ఆదిత్య 369 సినిమాలో టైమ్ మెషీన్ గుర్తుందా ? ఇది చూడటానికి అచ్చం అదే పరిమాణంలో ఉంది. తొలుత ఏమనుకున్నారో ఏమో గానీ.. ఆ తర్వాత ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా దానిని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఇంతకీ ఏంటి ఆ వస్తువు ? అంత పెద్ద పరిమాణంలో ఉన్నది ఎందుకు కిందపడిపోయింది? అనేదానికి సరైన సమాధానాలు లేవు. తర్వాత అక్కడి రైతులు అధికారులకు సమాచారమివ్వగా.. ఆ వస్తువును పరిశీలించిన అధికారులు అది వాతావరణ మార్పులను పరిశీలించేందుకు ప్రయోగించిన హీలియం బెలూన్ అని వెల్లడించారు. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం ఇలాంటి బెలూన్లను గగనతలంలోకి ప్రయోగిస్తుంటారని తెలిపారు. మొగిలిగుండ్ల వద్ద కూలిపోయిన బెలూన్ ను టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ పంపించినట్టు వెల్లడించారు. బెలూన్ చుట్టూ కెమెరాలు ఉన్నాయని, ఆ బెలూన్ లో కూర్చోవడానికి ఓ సీటు కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు.