హైదరాబాద్‌లో సంచలనం రేపిన మలక్‌పేట్ శిరీష(Malakpet Sirisha Case) హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. శిరీషను చంపింది ఆమె భర్త కాదని.. భర్త సోదరి సరిత అని తేల్చారు. భర్త వినయ్ సోదరి సరితతో జరిగిన గొడవే హత్యకు కారణం అని మలక్‌పేట్ ఏసీపీ శ్యాంసుందర్ తెలిపారు. ఈ కేసులో నిందితులు సరిత, వినయ్, నిహాల్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
కేసు గురించి ఏసీపీ శ్యాంసుందర్ మాటల్లోనే..
“శిరీష మృతిపై ఆమె మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీష మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దోమలపెంట తరలిస్తున్న సమయంలో ఆమన్ గల్ వద్ద వినయ్ కుమార్ కి కాల్ చేసి.. అంబులెన్స్ ను వెనక్కి రప్పించాం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారించాం. పోస్టుమార్టం రిపోర్టులో.. గొంతు నులిమి శిరీషను చంపినట్లు ఉంది. శిరీష భర్త వినయ్ కుమార్, అతడి అక్క సరిత, వినయ్ మరో అక్క కొడుకు నిహాల్ ను అదుపులోకి తీసుకుని విచారించాం. శిరీషను తానే హత్య చేసినట్లు సరిత ఒప్పుకుంది. సరిత, శిరీష ఇద్దరూ సన్ రైజ్ హాస్పిటల్ లో పరిచయం అయ్యారు. శిరీష అనాధ అవడంతో.. తన తమ్ముడు వినయ్ తో పెళ్ళి సంబంధం సెట్ చేసింది.
నర్స్ ట్రైనింగ్ చేసిన శిరీష సన్‌రైజ్ ఆసుపత్రిలో మానేసి కాచిగూడ బ్రిస్టల్ కోన్ హాస్పిటల్‌లో చేరింది. ఆ తర్వాత వివేర హాస్పిటల్‌లో చేరింది. కొన్ని నెలల తర్వాత అక్కడ కూడా మానేసింది. దీనిపై శిరీష, సరిత మధ్య గొడవ జరిగింది. ఒక్కచోట కూడా కుదురుగా పని చేయవు అని శిరీషతో గొడవ పడింది సరిత. ఈ క్రమంలో నీ చరిత్ర, నీ అక్కరమ సంబంధాలన్నీ నాకు తెలుసు. అందరికీ చెబుతాను అని సరితను బెదిరించింది శిరీష. మరుసటి రోజు సరిత ఇంటికి వెళ్లి శిరీష సారీ చెప్పింది.
సరితకు మత్తుమందు వేసుకునే అలవాటు ఉంది. తనకు నిద్ర పట్టడం లేదని, మత్తుమందు కొంచెం ఇవ్వమని సరితను అడిగింది శిరీష. ఎప్పటికైనా శిరీష తన చరిత్ర అంతా బయటపెట్టే అవకాశం ఉందని భయపడిన సరిత.. మత్తుమందు డోస్ పెంచి ఇచ్చింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన శిరీష ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ విషయం వినయ్ కమార్‌కి చెప్పింది. భార్యను హత్య చేసిన విషయం తెలిసినా.. అక్క సరితను ఏమీ అనలేదు. తన మరో అక్క కొడుకు నిహాల్ సాయంతో సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శిరీష చనిపోయిందని అక్కడి డాక్టర్లు చెప్పగానే.. వెంటనే వినయ్ సొంతూరు దోమలపెంట తీసుకెళ్లే ప్రయత్నం చేశారు” అని ఏసీపీ వెల్లడించారు.