Bio diesel Through Used Cooking Oil: పూరీలు, బోండాలు, బజ్జీలు, పకోడీలు లాంటి ఆయిల్ ఫుడ్స్ చేయాలంటే సాధారణంగా చాలా వంట నూనె అవసరం. అయితే వంట పూర్తయిన తర్వాత ఆ మిగిలిన నూనెను మళ్లీ ఉపయోగించకూడదు. అలా వాడినట్లయితే ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు.. కానీ ఏ హోటళ్లు, రెస్టారెంట్లు ఈ నిబంధనను పాటించవు. అంతెందుకు గృహిణులు కూడా ఆ నూనెను పారబోసేందుకు మనసొప్పక మళ్లీ వంటలకు వాడుతుంటారు. అయితే ఇకపై మీకు ఆ సమస్య లేదు. ఒకసారి వాడిన వంట నూనెతో ఆదాయంతో పాటు బయో డీజిల్‌ను తయారు చేయవచ్చు. అదెలా అంటారా..
ఒకసారి వంట కోసం వినియోగించిన ఆయిల్‌ను మళ్లీ ఉపయోగించకుండా.. అలా అని పారబోయకుండా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఓ నిర్ణయం తీసుకుంది. వినియోగించిన లీటరు నూనెకు ఏకంగా రూ. 65 చెల్లిస్తోంది. ఇలా సేకరించిన వంట నూనెతో బయో డీజిల్‌ను తయారు చేస్తున్నారు. ఈ బయో డీజిల్‌ను వాహనాల్లో ఉపయోగించవచ్చు. ఈ విషయం తెలియక ఎన్నో రెస్టారెంట్లు, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/lifestyle/these-seeds-helps-in-to-reduce-bad-cholesterol-fast/
భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(FSSAI) ‘ఈట్ రైట్’ అనే పథకంలో భాగంగా రుకో(రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్) ప్రాజెక్టును చేపట్టింది. ‘రుకో’ ద్వారా వాడేసిన వంట నూనెలను బయోడీజిల్‌గా మార్చి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంది. ఈ రుకో కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇకో సిస్టం నినాదంతో ‘ట్రిపుల్ ఈ’ పేరుతో నిర్వహిస్తున్నారు.
ఒకసారి వంట కోసం కాచిన నూనెను పదే పదే వినియోగిస్తే అనేక దుష్ప్రభావాలు.. అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ లాంటి జబ్బులు సోకే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని నియంత్రించేందుకు ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ 2018లో ‘రుకో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రెస్టారెంట్లలో వంటల కోసం వినియోగించిన నూనెను సేకరించి, వాటిని బయోడీజిల్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు దేశంలోని 16 రాష్ట్రాల్లో అమలవుతుండగా.. తెలంగాణలో ఈ మధ్యే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/health-fitness/why-not-to-eat-brinjal-know-answer-from-experts/
ఇందుకోసం వైద్యారోగ్యశాఖ పరిధిలోని ఆహార భద్రత తనిఖీ విభాగం, జీహెచ్ఎంసీ ఏజెన్సీలను నియమించారు. దాదాపు 500 రెస్టారెంట్ల నుంచి వేల లీటర్ల వాడిన నూనెను సేకరించి బయోడీజిల్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రుకో కార్యక్రమాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాగా, వాడేసిన వంట నూనెను రీసైకిల్ చేసే బయోడీజిల్ ప్లాంట్లు ఇప్పటి వరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి.
అయితే రెస్టారెంట్లలో వాడిన నూనెలను ప్రభుత్వ లైసెన్స్డ్ ఏజెన్సీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి లీటరుకు రూ. 65 చెల్లించి.. ఈ నూనెను బయోడీజిల్ ప్లాంట్లకు తరలిస్తారు. అయితే కనీసం 50 లీటర్ల నూనె ఉంటే ఏజెన్సీలే వచ్చి తీసుకెళ్తాయి. ఈ రుకో ప్రోగ్రాంలో చేరాలనుకునే హోటళ్లు, రెస్టారెంట్ల జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి భానును 83283 78502 నంబరులో సంప్రదించవచ్చని ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు.


