తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడే చర్యలు చేపడుతున్నాయి. ఈ నెేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-12-at-5.57.11-PM-1-1024x576.jpeg)
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కోదాడ, నాగార్జునసాగర్, వాడపల్లి దగ్గర పశువైద్య సిబ్బంది, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నుంచి వచ్చిన కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు అధికారులు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పౌల్ట్రీలు సందర్శించి రైతులకు తగిన సూచనలు ఇస్తున్నారు.
గత 15 రోజుల్లోనే ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లో 50 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లుగా తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం అనుముల్లంకలో ఓ పౌల్ట్రీఫామ్‌లో రెండు రోజుల వ్యవధిలోనే 11 వేల కోళ్లు చనిపోయాయి.
ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా నిర్వాహుకులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు రూ.లక్షల్లో నష్టపోయామంటూ ఆవేదన చెందుతున్నారు.రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.