తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆందోళన కొనసాగుతోంది. నెల రోజుల క్రితం ఏపీతో పాటు తెలంగాణలో పలు జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. తాజాగా తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత నెలలో బర్డ్ ఫ్లూ కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై, పౌల్టీ ఫార్మ్ యాజమానులకు, ప్రజలకు జాగ్రత్తలు సూచించింది. ఆ సమయంలో చికెన్ విక్రయాలు తగ్గాయి. అయితే కొద్ది రోజుల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిపోవటంతో రాష్ట్రంలో పరిస్థితి సరిగయింది. ఇక మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
యాదాద్రి జిల్లాలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెలోని ఓ కోళ్లఫామ్ లో వందల కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపగా, బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి జానయ్య, 30మంది వైద్యులతో కూడిన బృందం శుక్రవారం కోళ్లఫామ్ వద్దకు చేరుకున్నారు.
వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్లు, మాస్క్ లు ధరించి ఫామ్ లోకి వెళ్లి 29,796 కోళ్లను చంపి సంచుల్లో ప్యాక్ చేసి, గొయ్యి తీసి పాతిపెట్టారు. 20,000 కోడిగుడ్లను, కోళ్ల వ్యర్థాలను కూడా పూడ్చిపెట్టారు. కోళ్ల ఫాం దాణాను సీజ్ చేశారు. ఫామ్ ను 15 రోజులకు శానిటైజ్ చేయాలని, 3 నెలల పాటు కోళ్లు పెంచవద్దని యాజమానులకు సూచించారు.
జిల్లా పశువైద్యాధికారి జానయ్య మాట్లాడుతూ, 90 టన్నుల దాణాతో పాటు కోళ్ల పెంటను కూడా దహనం చేస్తామని తెలిపారు. ఫాం పరిధిలో 1 కిలోమీటర్ వరకు పూర్తిస్థాయిలో శానిటేషన్ చేస్తామన్నారు. 3 నెలల వరకు పౌల్ట్రీ ఫామ్ ను సీజ్ చేస్తామని, ప్రభుత్వ ఆదేశాల తరువాతే తిరిగి నిర్వహణకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ధోతిగూడెంలో బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.