BJP leader comments on Congress candidate: కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్‌పై బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తున్న నాయకుడు మజ్లిస్ అభ్యర్థి అని అన్నారు. హస్తం గుర్తు కింద ఉన్నా.. ఆలోచన మాత్రం ఎంఐఎందేనని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేసి ప్రలోభ పెట్టారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని తెలిపారు. ఒకే ఇంట్లో 43 ఓట్లను నమోదు చేయించడం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని తెలిపారు. మజ్లిస్‌కు చెందిన అభ్యర్థిని కాంగ్రెస్ టికెట్ మీద పోటీకి దింపడం ద్వారా కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని ఎన్వీ సుభాష్ అన్నారు.
అందుకే మజ్లిస్ మద్దతు: కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ మద్దతు ఇవ్వడం వెనుక అసలైన కారణం వేరే ఉందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం మజ్లిస్‌కు అప్పగించాలన్న పథకంలో భాగంగానే ఈ నాటకం జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్‌ను, ఎంఐఎంను నమ్మితే మళ్లీ తెలంగాణలో రజాకార్ల పాలన వస్తుందని తెలిపారు. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ కాస్తా బ్రాండ్ రజాకార్‌గా మారే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచుకోని ఆరు గ్యారంటీలు, 420 హామీల మాదిరిగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం అటుకెక్కిందని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ కళాశాల విద్యార్ధికి ఉన్న అవగాహన కాంగ్రెస్ పెద్దలకు, సీఎం రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవ చేశారు.
కుంటుపడిన గ్రామాలు: కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎన్వీ సుభాష్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో తెలంగాణకు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.4 వేల కోట్లు రాలేదని అన్నారు. గత 18 నెలలుగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడటానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీని దోషిగా చూపించాలనే కాంగ్రెస్ దురాలోచనను, కుట్రను యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుందని అన్నారు.


