ప్రధాని మోదీ(PM Modi) కులంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మోదీతో పెట్టుకుంటే మటాష్ అవుతారని హెచ్చరిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) మండిపడ్డారు. అసలు మోదీ కులం గురించి మాట్లాడేందుకు రేవంత్ రెడ్డికి ఏం అర్హత ఉందని ధ్వజమెత్తారు. మోదీతో పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), కేసీఆర్ (KCR) ఏమయ్యారో తెలియదా అంటూ చురకలు అంటించారు.
ఇక మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender) కూడా రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి పోయేకాలం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ కూడా కళ్ళు నెత్తికి ఎక్కి మోదీ గీడీ అని మాట్లాడారని గుర్తు చేశారు. మోదీ మీద విమర్శలు సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టు ఉన్నాయన్నారు. మోదీతో గొక్కోవడం అంటే ధర్మంతో, ప్రజలతో గోక్కోవడమే అన్నారు. ఆ నిమిషానికి చప్పట్లు కొట్టొచ్చు కానీ తరువాత పర్యావసానాలు వేరుగా ఉంటాయని ఈటల హెచ్చరించారు.
కాగా శుక్రవారం గాంధీ భవన్ (Gandhi Bhavan)లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదని.. ఆయనో కన్వర్టెడ్ బీసీ అంటూ వ్యాఖ్యానించారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో ఉండేవారని.. సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో కలిపారని విమర్శలు చేశారు.