బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత మరో షర్మిల కాబోతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను కట్టుబట్టలతో బయటకు పంపేందుకు కేటీఆర్, హరీష్ రావు ఒక్కటయ్యారని ఆరోపించారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయని, ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా పరిణామం చెందాయన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. టీపీసీసీ చీఫ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind)మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కవిత మంచి స్నేహితులంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కానీ, ప్రస్తుతం సీఎంగా ఉన్న తరుణంలో కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడూ కవితను విమర్శించలేదని గుర్తుచేశారు. కేసీఆర్ తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం వల్లే బీఆర్ఎస్‌కు ఈ దుస్థితి పట్టిందన్నారు. కేసీఆర్ పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ఉట్రం సాధ్యమైందని, అందరినీ కలుపుకొనిపోయే నాయకుడిగా ఆయన వ్యవహరించారని కొనియాడారు. దీంతో బీజేపీ నేతల వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.