బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్టైలే వేరు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. పక్కా హిందూత్వ వాది అయిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం కావడంతో పార్టీ ఆయనను కొన్ని నెలల పాటు సస్పెండ్ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీతో ఆయన పోరాడుతూ ఉంటారు. అలాంటి రాజాసింగ్ తాజాగా పార్టీలోని సొంత నేతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తనకు బ్రోకరిజం చేయడం రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే.. కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి పదవిని కట్టబెట్టారని మండిపడ్డారు. దీనిపై ఓ ముఖ్య నేతను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. తన నియోజకవర్గంలోని గోల్కొండ-గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వాలని లేదంటే పార్టీకి రాజీనామా చేస్తానని రాజాసింగ్ హెచ్చరించారు.