Jubilee Hills by election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమల దళం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తొలిసారిగా కార్పెట్ బాంబింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, ఇతర బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, శాసన మండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒక్కసారిగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. ఈ తరహా ప్రచారంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గంలో గల్లీగల్లీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టుగా సమాచారం. అంతే కాకుండా ప్రచారంలో వెనుకబడ్డారన్న ఆరోపణలను పటాపంచలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని హైకమాండ్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది.
ప్రాంతీయ అభిమానాన్ని కొల్లగొట్టాలి: నియోజకవర్గంలో ప్రాంతీయాభిమానాన్ని కొల్లగొట్లాని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఏ కాలనీలో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారనే స్పష్టమైన నివేదిక ఇప్పటికే రుపొందించారు. వారిని ప్రభావితం చేసే నేతలను గుర్తించే పనిలో సైతం ఉన్నారు. దీంతో ఉత్తరాది నుంచి వచ్చిన వలస ఓటర్ల కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్, ఇతర నేతలను ప్రచారంలోకి దించుతున్నట్టుగా పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఏపీ, తమిళనాడు ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షించడం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
కార్యకర్తల్లో నూతనోత్సాహం: జీఎఎస్టీ స్లాబ్‌లను తగ్గించడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు ఇతర నేతలను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని పార్టీ పెద్దలు ఆదేశించారు. నేతలు ప్రచారంలో ఉంటేనే.. కార్యకర్తల్లో నూతనోత్సాహం వస్తుందని హైకమాండ్ భావిస్తోంది


